గచ్చిబౌలి ల్యాండ్ ఇష్యూ.. CM రేవంత్ నెక్ట్స్ స్టెప్ ఇదే

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-05 13:37:18  IST  )

గచ్చిబౌలి(Gachibowli)లోని 400 ఎకరాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.

గచ్చిబౌలి ల్యాండ్ ఇష్యూ.. CM రేవంత్ నెక్ట్స్ స్టెప్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి(Gachibowli)లోని 400 ఎకరాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వ తదుపరి కార్యచరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏఐ వీడియోల సృష్టిపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నడూ వన్య ప్రాణాలు, పర్యావరణం వంటి వివాదాలు రాలేదన్నారు.

కావాలనే ఈసారి ఏఐ ఫేక్ వీడియో(AI Videos)లతో విద్యార్థులను రెచ్చగొట్టి.. గందరగోళం సృష్టించారని అన్నారు. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిన సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫేక్ వీడియోలు అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫేక్ కంటెంట్ భవిష్యత్‌ యుద్ధాలకు బీజం వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ క్రైం విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.

కాగా, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాస్తవాలు వెల్లడించే లోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్.. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్‌పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Next Story