- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఇంటికీ టీ-ఫైబర్ ఇంటర్నెట్.. తొలి దశలో 3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ
గ్రామీణ తెలంగాణకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది. అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ తెలంగాణకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది. అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం పాల్గొన్నారు. సమావేశంలో అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్‌ను తెలంగాణలో వేగవంతంగా అమలు చేయడానికి అవసరమైన కీలక అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన పూర్తి చేయడం, పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడం వంటి అంశాలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే మండల స్థాయి నుంచి గ్రామ పంచాయతీల వరకు ఏర్పాటు చేసిన రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందిస్తూ.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ లక్ష్యంగా
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి బలమైన హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అందించాలనే దృష్టితో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన తర్వాత తెలంగాణలో నిజమైన డిజిటల్ తెలంగాణకు పునాది పడనుంది. టీ-ఫైబర్ నెట్‌వర్క్ ప్రత్యేకత రింగ్ ఆర్కిటెక్చర్ విధానం. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానిస్తారు. ఒక మార్గంలో అంతరాయం ఏర్పడినా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరంతర హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ-గవర్నెన్స్ సేవలు గ్రామస్థాయికి చేరే అవకాశాలు మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
తొలిదశలో 3,089 గ్రామాలకు..
టీ-ఫైబర్ ప్రాజెక్టు తొలి దశలో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో దెబ్బతిన్న నెట్‌వర్క్‌ను పునరుద్ధరించనున్నారు. మొత్తం 3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ పనులు చేపడుతారు. అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద ఈ గ్రామాలకు ఆధునిక ఫైబర్ మౌలిక సదుపాయాలు కల్పించి, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా డిజిటల్ కనెక్టివిటీ అందించనున్నారు. టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుతో తెలంగాణలో గ్రామీణ డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇంటర్నెట్ సేవలను ప్రతి ఇంటికి చేరవేసే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుండగా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్ డిజిటల్ అభివృద్ధికి కీలక మలుపుగా మారనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రెటరీ డి.అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయండి
వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో పెట్టాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని అన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.






