కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు CM రేవంత్.. ఉస్మానియా ఆస్పత్రి పనులపై సమీక్ష

by Kema Shiva Kumar |

దేశంలోనే అతి పురాతనమైన, చారిత్రాత్మకమైన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ సర్కార్ పూనుకున్న విషయం తెలిసిందే.

కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు CM రేవంత్.. ఉస్మానియా ఆస్పత్రి పనులపై సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతి పురాతనమైన, చారిత్రాత్మకమైన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ సర్కార్ పూనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాల నిర్మాణం, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

కాగా, గోషామహల్‌ స్టేడియంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎంఈఐఎల్‌ (MEIL) సంస్థ ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. రాబోయే రెండున్నరేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. కొత్తగా నిర్మించబోయే 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆస్పత్రిలో మొత్తం 12 అంతస్తులతో 2 వేల పడకలు అందుబాటులో ఉండనున్నాయి. 29 మేజర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, 12 మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, రోబోటిక్‌ సర్జరీ థియేటర్లు, అవయవ మార్పిడి యూనిట్‌‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. అదేవిధంగా ఒకేసారి 1,500 కార్లకు పార్కింగ్‌ వసతి కల్పించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు హెలిప్యాడ్‌‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అకడమిక్‌ బ్లాక్‌‌లో పురుషులు, మహిళలకు ప్రత్యేక వసతి గృహాలు, మార్చురీ, యుటిలిటీ బిల్డింగ్‌, సివరేజ్, బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంటు, నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరఫీ కాలేజీలు, రూప్‌టాప్‌ టెర్రస్‌ గార్డెన్‌ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు కానున్నాయి.

Next Story