- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగపూర్‌కు CM రేవంత్ టీమ్.. ఈసారి అంతకు మించి సాధించాలని నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం ఈరోజు రాత్రి విదేశీ పర్యటనకు బయలుదేరనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం ఈరోజు రాత్రి విదేశీ పర్యటనకు బయలుదేరనుంది. ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu), పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో ఉంటారు. ముందుగా సింగపూర్(Singapore)కు వెళ్లి.. 17,18,19 తేదీల్లో సింగపూర్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ని సందర్శిస్తారు. నైపుణ్య అభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University)కి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈ(Singapore ITE)తో ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్‌లో రివర్ ఫ్రంట్‌ను సందర్శిస్తారు. ప్రపంచ స్థాయిలో మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేసిన తీరుతెన్నులను పరిశీలిస్తారు. సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి బృందం 20వ తేదీ ఉదయం దావోస్(Davos)కు చేరుకుంటుంది. 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు 2025(World Economic Forum Annual Conference)లో పాల్గొంటారు.
పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈసారి అంతకు మించిన పెట్టుబడుల లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులతో సమీక్షలో వెల్లడించారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు సమీకరించే లక్ష్యంతో సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ విదేశీ పర్యటనకు బయల్దేరుతోంది.






