CM Revanth Reddy: రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తేనే దేశాభివృద్ధి మరింత వేగం: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-11-18 07:33:30  IST  )

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

CM Revanth Reddy: రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తేనే దేశాభివృద్ధి మరింత వేగం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్‍ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగం అవుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో అర్బన్ డెవలప్‍మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ (Urban Development Ministers Regional Meeting) జరిగింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar), ఏపీ మంత్రి పి.నారాయణతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నాతాధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రణాళికలను కేంద్రానికి పంపించామని కేంద్రం వేగంగా అనుమతులు ఇచ్చి సహకరించాలని కోరారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే దేశాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకంగా మారుతుందని చెప్పారు.

డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్:

వచ్చే నెల 9వ తేదీన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయబోతున్నామని సీఎం చెప్పారు. ఈ డాక్యుమెంట్‍లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలను ఆవిష్కరిస్తామన్నారు. 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకనమి స్టేట్‍గా అవతరించాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. 2047 నాటికి కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో తెలంగాణ రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. మెట్రో రైల్ విస్తరణ, మూసీ రివర్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్‍కు కృష్ణా, గోదావరి జలాల తరలింపు, హైదరాబాద్ కాలుష్యం, ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు కేంద్రం సహకరించాలన్నారు. 30000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని ఈ సిటీ న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, దుబాయ్ వంటి నగరాలతో పోటీ పడేలా ఈ సిటీగా నిర్మించబోతున్నామన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మా పోటీ తమ పొరుగు రాష్ట్రాలతో కాదని ప్రపంచ నగరాలతోనేనన్నారు. మాకు ఇరుగు పొరుగున ఉన్నవన్నీ మా స్నేహపూర్వక రాష్ట్రాలు అన్నారు.

Next Story