- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: కిరికిరిగాళ్లను పక్కన పెట్టండి.. సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాల్లో అందరూ ఏకమై సర్పంచ్ లను (Sarpanch Elections) ఏకగ్రీవం చేసుకోవాలని లేదా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మెలిసి పని చేసే వారినే సర్పంచ్‍లుగా ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. మద్యానికి ఆశపడో కాళ్లలో కట్టెలు పెట్టేవారిని ఎన్నుకుంటే అది వారికి రాజకీయంగా పనికి వస్తుందేమో కానీ మీ గ్రామాభివృద్ధికి నిధులు రావన్నారు. కేంద్రంతో కొట్లాడైనా అత్యధిక నిధులు గ్రామాలకు వచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. కిరికిరి సర్పంచ్ లు వస్తే ఐదేళ్ల కాలం వృథా అవుతుందన్నారు. అలాంటి వారిని ఎన్నుకోవద్దని సూచించారు. ఇవాళ హుస్నాబాద్ (Husnabad Sabha) నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఎవరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని అదే మన ప్రభుత్వం పదేళ్ల కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపించబోతున్నామని చెప్పారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, సారె పేరుతో ఇందిరమ్మ చీరలు, 200 యూనిట్ల విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయంటే మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే జరిగాయని, మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే ఓ మంచి వ్యక్తి గ్రామ సర్పంచ్ గా ఉంటే ఆ గ్రామం అలా అభివృద్ధి చెందుతుందన్నారు.
త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు:
రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. హుస్నాబాద్ ప్రజల అభిమానం మరువలేనిదని ఈ ప్రాంతం నుంచే బహుజనులుదుండు కట్టి ఉద్యమించారని చెప్పారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని 2004లో కరీంనగర్ గడ్డ నుంచే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి 2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు చరమగీతం పాడారు. శ్రీకాంతాచారి బలిదానం జరిగింది కూడా ఇదే రోజు అన్నారు.
త్వరలోనే గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం:
గత పాలకులకు గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలే నియోజకవర్గాలుగా కనిపించాయని వీటికి మాత్రమే నిధులు వరదలై పారాయని సీఎం విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు అన్ని పూర్తయ్యాయాయి కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరెల్లి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదన్నారు. త్వరలోనే గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామన్నారు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్‍ను నిర్లక్ష్యం చేయబోమన్నారు.






