- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీకి ప్రజలు అండగా నిలవాలి.. ఓట్ చోరీ మహా ధర్నాలో సీఎం రేవంత్ ప్రసంగం
తమ నేత రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు బీజేపీని 240 సీట్లకు పరిమితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని తమ నేత రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు బీజేపీని 240 సీట్లకు పరిమితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు బీజేపీకి పూర్తి అధికారం ఇవ్వకపోవడం వల్ల ఇవ్వాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఓట్ చోర్ గద్దీ చోడ్ పేరిట ఆదివారం మహార్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత లోక్ సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుద్దామనుకున్న బీజేపీ అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
నాడు పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల కోసం గాంధీ, అంబేడ్కర్‌లు వారికి అండగా నిలబడిన విధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నిలుచున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు విషయమై చర్చిస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ నేతలు. గోల్వాల్కర్ తదితరులు వారికి ఓటు హక్కు ఇవ్వవద్దన్నారని, గాంధీ, అంబేద్కర్ వారికి ఓటు హక్కు కల్పించినందున ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటులో వాళ్లు భాగస్వాములవుతున్నారని సీఎం తెలిపారు. ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి భావజాలాన్ని అమలుచేసేందుకు 400 సీట్లు కావాలని కోరుకున్నారని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో తొలుత దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదల ఓటర్ కార్డు తొలగిస్తారు.. తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు తొలగిస్తారు.. వాళ్లకున్న హక్కులన్నీ గుంజుకుంటారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనితో ఆదివాసీలు, మూలవాసీలు అన్ని కోల్పోతారని, ఈ సమస్య ఎన్నికలదో, కాంగ్రెస్ పార్టీదో కాదు.. దేశ సమస్య అని సీంఎ చెప్పారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, దేశ ప్రజలంతా కలిసి రావాలని కోరుతున్నట్లుగా రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
ఈసీని బీజేపీ జేబు సంస్థగా వాడుకుంటోంది : టీపీసీసీ చీఫ్
బీజేపీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఈసీని బీజేపీ జేబు సంస్థగా వాడుకుంటోందని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో కోటికి పైగా ఓట్లను జత చేశారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్రానికి కనువిప్పు కలిగే విధంగా మహా ర్యాలీ నిర్వహించామన్నారు.
ఓటు చోరీపైన రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో ప్రజలు కలిసి రావాలి : మంత్రి పొన్నం
ఓట్ చోరీ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్లు తొలగించకుండా ఈసీ సరైన విధంగా వ్యవహరించాలని, బీజేపీకి ఈసీ అనుబంధ సంఘంగా మారిపోయిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఓటు చోరీపైన రాహుల్ గాంధీ ఉద్యమాన్ని తీసుకున్నారని, ఆయన చేస్తున్న పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలని పొన్నం ప్రభాకర్ పిలుపు ఇచ్చారు. అధికారం కోసం బీజేపీ వ్యవస్థలను ఉపయోగించుకుంటుందని, తెలంగాణ నుంచి ప్రజల నుంచి సేకరించిన సంతకాలు అందజేస్తామని ఆయన తెలిపారు.






