ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు.. ‘షీల్డ్-2025’ సదస్సులో సీఎం రేవంత్ ఆసక్తికర ప్రసంగం

by Ramesh Naini |

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దాం.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు.. ‘షీల్డ్-2025’ సదస్సులో సీఎం రేవంత్ ఆసక్తికర ప్రసంగం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దాం.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ‘షీల్డ్‌ -2025’ కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు షీల్డ్ 2025ని నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు.. ప్రభుత్వం నిపుణులు, ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి, అన్ని రకాల వనరులు సమకూరుస్తోందన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్‌గా మార్చాలని తెలిపారు.

దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది రూ. 22,812 కోట్లు దోచుకున్నారని ఒక అంచనా ఉందని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు, మన పౌరులకు ముప్పు అని తెలిపారు. ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ అనేది మరో ప్రధానమైన ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో సమాజంలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పారు. 24/7 సైబర్ హెల్ప్‌లైన్ 1930 నంబర్ ను అందరికీ షేర్ చేయాలని ప్రతి ఒక్కరినీ కోరారు. పూర్తిస్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి అంకితమైన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి చెప్పుకొచ్చారు.

గత ఏడాది తెలంగాణలో 7 కొత్త ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని, నేడు దొంగలు ఎక్కడో ఉండి మన సొమ్మును దొంగిలిస్తున్నారని అన్నారు. నేరాల శైలి మారుతోందని, మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని వివరించారు. మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సీఎం అభినందించారు.

Next Story