‘మీరు ఆ ఒక్క పనిచేస్తే చాలు’.. కేసీఆర్‌కు CM రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-23 11:30:20  IST  )

బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

‘మీరు ఆ ఒక్క పనిచేస్తే చాలు’.. కేసీఆర్‌కు CM రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌(Zaheerabad)లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటాం.. ఇందిరమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి మెదక్ గుర్తొస్తుందని తెలిపారు. తన చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా కొనసాగిన నాయకురాలు ఇందిరమ్మ(Indiramma) అని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో నిమ్జ్ అభివృద్ధి కుంటుపడింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచాం, భూసేకరణను వేగవంతం చేశాం. త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు మొదలుపెడతారని చెప్పడానికి సంతోషిస్తున్నా అని కీలక ప్రకటన చేశారు.

నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మరో ప్రకటన చేశారు. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతామని చెప్పారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని నా దృష్టికి తీసుకొచ్చారు. నారాయణఖేడ్‌కు సురేష్ షెట్కర్, సంజీవరెడ్డి రెండు కళ్లలంటివారు. నారాయణఖేడ్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం.. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచాం.. భూమిలేని పేదలకూ భరోసా అందిస్తున్నాం.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం.. స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులను అందించి వారిని ప్రోత్సహిస్తున్నాం.. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలనే కార్యాచరణతో ముందుకెళ్తున్నాం.. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మరోసారి అన్నారు.

ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ఆయన తన ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుని నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటాం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోడీని ఎన్నిసార్లయినా కలుస్తాం.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. శాసనసభకు రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి.. మేం ఏదైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి.. సరిదిద్దుకుంటాం.. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామని మీరు అనుకుంటే.. ప్రజలు మళ్లీ గుణపాఠం చెబుతారు.. ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అండగా ఉండాలి.. గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను. ముఖ్యమంత్రి అయ్యాక కూడా నేను ఏనాడు అహంభావం ప్రదర్శించలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ కలుస్తున్నాను. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చేవరకు నేను నిద్రపోయేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఎన్నికలప్పుడే రాజకీయాలు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

Next Story