అతితెలివితోనే కేసీఆర్ సభ: మేడిగడ్డలో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 14:01:16  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అతితెలివితోనే కేసీఆర్ సభ: మేడిగడ్డలో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఆయన, కుంగిన పిల్లర్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై, కేంద్రంలోని బీజేపీ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తుమ్మడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని.. అయితే కేసీఆర్ మాత్రం ఆర్థిక ప్రయోజనం లేదనే సాకుతో దాన్ని రీడిజైన్ చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి, అంచనా వ్యయాన్ని రూ. 35 వేల కోట్ల నుంచి ఏకంగా లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. కాళేశ్వరం ఓ అద్భుతమని అందరినీ భ్రమల్లో ముంచారు. కానీ, కేసీఆర్ అవినీతిని ప్రకృతే బయటపెట్టింది. అందుకే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయింది అని సీఎం వ్యాఖ్యానించారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

అతితెలివి రాజకీయాలు..

తాము నెల రోజుల ముందే మేడిగడ్డ పర్యటన ఖరారు చేసుకున్నామని.. తమ బండారం బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్ నేడు కావాలనే రాజకీయ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఎక్కడ విచారణకు ఆదేశిస్తుందో అనే భయంతో హరీష్ రావు బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావులను జైల్లో పెడతామని గతంలో బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారని.. కానీ తాము రెండుసార్లు సీబీఐకి లేఖలు రాసినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పునరుద్ధరణపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాము ఇప్పటికే సాంకేతిక నిపుణులు మరియు మూడు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించామని, శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు మొదలుపెట్టామని వెల్లడించారు. ఈ పర్యటనలో మంత్రులు, ఇరిగేషన్ నిపుణులు పాల్గొని బ్యారేజీ స్థితిగతులను నిశితంగా పరిశీలించారు.

బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నేత జీవన్ రెడ్డి.. కండువా కప్పిన కేసీఆర్

Next Story