CM Revanth Reddy: రాహుల్ గాంధీతో గ్యాప్ పై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

by Prasad Jukanti |   (  Updated:2025-02-07 11:25:45  IST  )

కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: రాహుల్ గాంధీతో గ్యాప్ పై  సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
X

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ విస్తరణ (Cabinet Expansion) ఇప్పట్లో లేనట్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో తీసివేతలు,కూడికలపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో (CM Delhi Tour) ఉన్న ఆయన ఇవాళ అక్కడ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతామని అన్నారు. తనకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని చెప్పారు. కులగణన ఆశామాషీగా చేసింది కాదు.. ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఈ విషయంలో ఈ రోజు లేదా రేపు ప్రకటన ఉంటుందన్నారు. నాకు రాహుల్‌గాంధీకి మధ్య గ్యాప్ లేదని, మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు. రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదన్నారు.

ఖర్గేతో ముఖ్యమంత్రి భేటీ

అంతకు ముందు పార్లమెంట్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ను రేవంత్ రెడ్డి కలిశారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ పని తీరు, తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఖర్గేకు వివరించినట్లు సమాచారం. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నారు. అనంతరం పీసీసీ మాజీ అధ్యక్షుడు మ‌ల్లు అనంత‌రాములు వ‌ర్ధంతిని పురస్కరించుకుని రేవంత్ ఢిల్లీలో ఆయ‌న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీగా రెండు సార్లు ఎన్నికైన మ‌ల్లు అనంత‌రాములు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంత‌గానో కృషి చేశార‌ని కొనియాడారు.

టీ కాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చలు

తెలంగాణ ముఖ్యనేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) విడివిడిగా చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ (Mahesh Kumar Goud), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy), ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీతో (Deepadas Munshi) చర్చించారు. పీసీసీ కార్యవర్గం కూర్పు, మంత్రివర్గ విస్తరణపై నేతల అభిప్రాయాలను సేకరించారు.

పీసీసీ కార్యవర్గానికి గ్రీన్‌సిగ్నల్

పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా పీసీసీ కార్యవర్గం ప్రకటించనుండగా అందులో సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని ఒక మాదిగ, ఒక ముస్లిం, ఒక లంబాడా, ఒక రెడ్డి వర్గాలతో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండనున్నట్లు తెలుస్తోంది. 15 - 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులపై కూడా ఈ చర్చల్లో కసరత్తు చేసినట్లు తెలిసింది.

Next Story