హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

by Prasad Jukanti |

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రోజు రోజుకు ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో పాటు పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్‌ రద్దీని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

హోంగార్డులు తక్షణమే ట్రాఫిక్ విధుల్లోకి:

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సీఎం సూచించారు. మూడు నెలల్లో ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు తగిన సంఖ్యలో హోంగార్డులను వెంటనే నియమించాలని, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను వెంటనే తిరిగి ట్రాఫిక్‌ విభాగంలోకి తీసుకురావాలన్నాన్నారు. తక్షణమే ట్రాఫిక్ నియంత్రణ విధుల కోసం వారి సేవలను ఉపయోగించుకోవడంతో పాటు రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ విధులకు లా అండ్ ఆర్డర్ పోలీసులను నియమించాలని సీఎం ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు సరిపడా సిబ్బంది ఉండేలా స్టేషన్లను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. నగరంలోని రోడ్లు, జంక్షన్ల విస్తరణపై దృష్టి సారించాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్‌లలో ఎల్‌బీ నగర్‌ జంక్షన్‌ తరహాలో సబ్‌వే, అండర్‌ పాస్‌, సర్ఫేస్‌ వే నిర్మాణ అవకాశాలను పరిశీలించాలన్నారు. కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్‌పై ఆధారపడకుండా నగర పరిధిలోని అన్ని జంక్షన్‌లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

కన్సల్టెన్సీల చేత అధ్యయనం:

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసు అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని ఆదేశించారు. నెలకోసారి సమావేశం నిర్వహించి ట్రాఫిక్ సమస్యలు, అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలన్నారు. ఇక నగరంలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని అందుకోసం ప్రత్యేక పార్కింగ్ విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేక అధ్యయనం చేయాలని సూచించారు.

Next Story