- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: మూసీ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు వద్దు.. బీఆర్ఎస్ నేతల సలహాలు కూడా స్వీకరిస్తాం
మూసీ పునరుజ్జీవం ఇప్పుడు చారిత్రక అవసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న సంకల్పంతో, మురికి కూపంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలన్న గొప్ప తలంపుతో, మూసీ దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కాలుష్య వెతలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్న మానవత్వంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక “మూసీ పునరుజ్జీవం - రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్” ప్రాజెక్టు తలపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టుపై కొందరు వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాం. ప్రముఖులు, పర్యావరణవేత్తలు, మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల సమక్షంలో ప్రభుత్వ విజన్‌ను, వాస్తవ అంశాలను స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరించాం. ఈ రోజు “MUSI INVITES” పేరుతో కార్యక్రమం నిర్వహించి మా ఆలోచనను సమాజం ముందు పెట్టాం. మూసీ పునరుజ్జీవం ఇప్పుడు చారిత్రక అవసరం. మా ప్రభుత్వం ప్రజలను నొప్పించి, పేదలను ఇబ్బంది పెట్టి ఏ పని చేయదు. ప్రతి అభివృద్ధి వెనుక కొంత మందికి ఇబ్బంది కలగడం సహజం. ఆ ఇబ్బందులకు పరిష్కారం చూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆ పరిష్కారంపై ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి మేం సిద్ధం.
మూసీ పరీవాహకంలో మురికి వాడల్లో పేదలు ఆత్మగౌరవాన్ని వదులుకుని బతకాలా!? వారు స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించాలన్నది మా ఆకాంక్ష. నది పునరుజ్జీవనంతో పాటు, పేదలకు ఆత్మగౌరవంతో కూడిన పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారు. అధికారాన్ని కాపలాదారుగా వినియోగిస్తాం తప్ప, ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు అనేది మా ప్రభుత్వం నమ్ముతుంది. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవడం విజ్ఞుల లక్షణం. మూసీ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.






