అలా జరిగితే కేసీఆర్‌ను క్షమాపణ అడుగుతా: CM రేవంత్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) పార్టీ, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

అలా జరిగితే కేసీఆర్‌ను క్షమాపణ అడుగుతా: CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీ, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని చండ్రుగొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచే మొదలైందని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పుడూ ఆదరించారని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కల నెరవేరలేదని విమర్శించారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం.. ఎక్కడా చిన్న అవకతవలకు తావు లేకుండా చూస్తున్నామని అన్నారు. నిజమైన లబ్ధిదారులు అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్పారు. ధరణి పోర్టల్ లాంటి కొరివి దయ్యాన్ని పారదోలడానికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ శాఖ(Department of Revenue) ఇచ్చామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం బాధ్యతలకు కూడా ఆయనకే ఇచ్చామని తెలిపారు. సమర్థుడు కాబట్టే పొంగులేటికి ఇన్ని కీలకమైన శాఖలు అప్పగించామని చెప్పారు. రాష్ట్రంలో 2004 నుంచి 2014 మధ్య 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కట్టించి ఇచ్చింది. తెలంగాణలో హనుమాన్ గుడి లేని గ్రామం అయినా ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం లేదని చెప్పారు. అయినా కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడమే పనిగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా వారిలో మార్పు రావడం లేదని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ వారికి ప్రజలు బుద్ధి చెబుతారని.. బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలా కాకుండా బీఆర్ఎస్ నేతలు ఊహించినట్లుగా స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అధిక సీట్లు వస్తే తానే స్వయంగా కేసీఆర్‌కు స్వయంగా సారీ చెబుతానని కీలక ప్రకటన చేశారు. దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి చూపించాలని సవాల్ చేశారు.

Next Story