- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alert: 15 జిల్లాల్లో భారీ వర్షాలు.. అవసరమైతే రాకపోకలు నిషేధించాలి! అధికారులకు సీఎం ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (Heavy Rain Alert) భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాయని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని సీఎం తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.
నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.
వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.






