- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్లపై చెత్త, గుంతా రెండూ కనిపించొద్దు.. CM రేవంత్ కీలక ఆదేశాలు
రాష్ట్రం మొత్తం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నాం.

దిశ, వెబ్‌డెస్క్: ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) లోపల ఉన్న కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియా(CURE)లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరించారు. కోర్-అర్బన్ రీజియన్‌ను మొత్తంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని హైదరాబాద్ నగర జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరాన్ని వివిధ జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ల(Zonal Commissioners)కు దిశానిర్దేశం చేశారు.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి..
“రాష్ట్రం మొత్తం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నాం. హైదరాబాద్ నగర పరిపాలన పట్టాలెక్కించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రధానంగా నగరంలో చెత్త నిర్వహణ అత్యంత సంక్లిష్యమైన సమస్య. ఈ సమస్యపై జోనల్ కమిషనర్లు తమ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చెత్త నిర్వహణతో పాటు జోన్ల వారీగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదే. జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిందే. నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దశల వారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
ఎక్కడా చెత్త కనిపించడానికి వీళ్లేదు..
నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీళ్లేదు. అలాగే రోడ్లపై గుంతలు కనిపించొద్దు. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వీలయినంత తొందరగా స్పందించాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టాలి. కోర్-అర్బన్ ఏరియాలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలని నిర్ణయించాం. నగరంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నాం.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
ప్రజలకు ముఖ్యంగా జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరక్కుండా, ఇబ్బందులు కలగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ఆన్‌లైన్ సేవల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లతో అనుసంధానం ఉండేలా కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి. హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC), వాటర్ వర్క్స్ (HMWSSB) విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలి. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి. కోర్ అర్బన్ ఏరియాలో ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారు. అందరూ కలిసి పనిచేస్తేనే నగర భవిష్యత్తు బాగుంటుంది..” అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






