- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.. చీకటి ఒప్పందం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ కంటిన్యూ: సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
రాష్ట్రంలో బీఆర్ఎస్పార్టీ బీజేపీకి బీ టీమ్ గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన కామెంట్లు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని అందుకే బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతే బీజేపీ ఎనిమిది సీట్లు గెల్చిందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 37 శాతం ఓట్లు వస్తే, లోక్‌సభ ఎన్నికల్లో అది 15 శాతానికి పడిపోయిందని సీఎం తెలిపారు. మాయమైన ఈ 22 శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయని, ఎవరికి చేరాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని ఆ పార్టీ కుట్ర చేస్తోందని సీఎం ఆరోపణలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ కి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి, బీఆర్ఎస్‌లే బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని, పేదలకు సాయం చేయకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసే ప్రత్యర్థి పార్టీల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు నాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. దేశంలో గాంధీ అనే పదం భారత దేశానికి పర్యాయపదమని, గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చిందన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారని, ఇందిరా వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిదని, గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈ నాటిది కాదని, మూడు తరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. సల్మాన్ ఖుర్షీద్ కి రాజీవ్ సద్భావన అవార్డు అందించడం మనందరికీ గర్వకారణమని, రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారని సీఎం వివరించారు.
తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి : మహేష్ కుమార్ గౌడ్
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీహార్ లో పది కిలోల దొడ్డు బియ్యం తప్ప మరే సంక్షేమం లేదని, తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన నడుస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 1990, అక్టోబర్ 19న దేశ ఐక్యత కోసం చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అప్పుడు తాను రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా ఆ యాత్రలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ యాత్రను పురస్కరించుకుని ప్రతి ఏటా సద్భావన కమిటీ అవార్డు అందజేస్తోందని, ఈ ఏడాది సల్మాన్ ఖుర్షీద్ కు ఇవ్వడం శుభ పరిణామమని, ఆయన మచ్చలేని వ్యక్తి అన్నారు. రాజీవ్ గాంధీ ఆలోచనల కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని, గత పదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమం నడుస్తుందని మహేష్కుమార్గౌడ్తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు.






