రైతు సంక్షేమంలో తగ్గేదే లేదు.. నర్మెట్ట సభలో సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రైతు భరోసా నిధుల విడుదల, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటు పలు కీలక ప్రకటనలు చేశారు.

రైతు సంక్షేమంలో తగ్గేదే లేదు.. నర్మెట్ట సభలో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా రైతుల విషయంలో వెనుకంజ వేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి జాతికి అంకితం ఇచ్చారు. అనంతరం అక్కడే రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వంటనూనె రిఫైనరీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు ఉత్సవాల పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

రైతుల కోసం ప్రతినెలా రూ.5,500 ఖర్చు:

ఈ సందర్భంగా రైతుల ఖాతాలోకి ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే 45 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుభరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని నేను నమ్ముతాననని ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు, సంక్షేమానికి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెటుతున్నా రైతులకు సంబంధించిన సంక్షేమానికి లోటురానివ్వడం లేదని చెప్పారు. ప్రతి నెలా రూ.5,500 కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. గడిచిన 28 నెలలో దాదాపు లక్ష 40 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసి రైతును రాజు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

పంట మార్పిడి అవసరం ఉంది:

రాష్ట్రంలోని పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం నిజాం కాలంలోనే వాణిజ్య పంటలకు ప్రసిద్ధిగా ఉండేది. గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు ఆకుకూరలు బాగా పండించేవారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రంగారెడ్డి జిల్లా పంటల సాగు తగ్గింది. దాంతో కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో పంటల మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతులను లాభసాటిగా చేసేలా అవసరమైతే ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, మోడీతో మాట్లాడుదామన్నారు. అయిల్ పామ్ పరిశ్రమ లాభసాటిదన్నారు. ప్రతిపంట సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో ఒక్కో జిల్లా ఒక్కో పంటకు ప్రసిద్ధి. రాష్ట్రంలో సారవంతమైన భూములున్నాయి. కష్టపడే రైతులు ఉన్నారు. మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల యూరియా కొరత ఏర్పడే సమస్య ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తయారవుతున్న యూరియా మొత్తం మనకే ఇవ్వాలి. యుద్ధం కారణంగా తెలంగాణలో యూరియా కొరత రాకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లాలని దీన్ని మంత్రి తుమ్మల సమన్వయం చేయాలన్నారు.

మహిళలకు ప్రాధాన్యత

మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని నిర్ణయించామన్నారు. మహిళల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా అహ్నిశలు నేను కష్టపడతాను. మహిళలు ఎదిగితే తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకనమిగా ఎదుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలకు అర్థ భాగస్వామ్యం వచ్చినప్పుడే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తాం:

విద్యాకమిషన్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు రాబోయే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి విద్యను అందించేలా రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా చేయిస్తామని అందువల్ల ప్రైవేట్ స్కూల్ మోజులో పడి ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దన్నారు. 18 వేలకు పైగా ఉన్న స్కూళ్లను ప్రక్షాళన చేసే బాధ్యత నాదేననిచెప్పారు. సాంకేతిక నైపుణ్యం వైపు మనం మళ్లాలన్నారు.

Next Story