- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. జులై 4న కృతజ్ఞత సభ
సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లకు చేరుకోవడంతో.. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండలం రుణం తీర్చుకోవాలని సంకల్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లకు చేరుకోవడంతో.. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండలం రుణం తీర్చుకోవాలని సంకల్పించారు. ప్రజాప్రతినిధిగా తన తొలి అడుగుకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించారు. జడ్పీటీసీ సభ్యుడి నుంచి రాష్ట్ర సీఎం వరకు సాగిన 20 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ జులై 4న కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలో మిడ్జిల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 2006 పరిషత్ ఎన్నికల్లో మిడ్జిల్ జెడ్పీటీసీగా ఆయన తొలి విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా, చివరకు సీఎంగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రజాప్రతినిధిగా రేవంత్‌రెడ్డి ప్రయాణం మొదలై జులై 4 నాటికి 20 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని సాధారణ రాజకీయ కార్యక్రమంగా కాకుండా కృతజ్ఞత సమర్పణగా నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ‘మీ బిడ్డను.. మళ్లీ వస్తున్నా. మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చింది’ అనే భావంతో మిడ్జిల్ ప్రజల ముందుకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం ముందుగా ఊరుకొండ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అనంతరం తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలతో ఆత్మీయంగా మధ్యాహ్న భోజనం చేస్తారు. మిడ్జిల్ సమీపంలో ఆనాటి లీడర్ గోపాల్‌రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. చివరగా మిడ్జిల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.
అంచెలంచెలుగా..
విద్యార్థి దశలో ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో స్వతంత్రంగానే అడుగుపెట్టారు. మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలుపొందిన తర్వాత 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి కొడంగల్ నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన, మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించి, 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. డిసెంబరు 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.






