SLBC పనులపై ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే.. నేడు ప్రారంభించనున్న CM రేవంత్‌రెడ్డి

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

SLBC పనులపై ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే.. నేడు ప్రారంభించనున్న CM రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నేటి నుంచి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల కోసం వైమానిక విద్యుదయస్కాంత సర్వే ప్రారంభం కానుంది. వైమానిక విద్యుదయస్కాంత సర్వే (ఏరియల్ ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే)ను సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 1:25 గంటలకు రెండో హెలిప్యాడ్ వద్ద అచ్చంపేట నియోజకవర్గ స్థానిక నాయకులతో సమావేశమైన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రోమాగ్నటిక్ లూప్‌ను సందర్శిస్తారు. అలాగే సర్వే హెలికాప్టర్‌లోని డేటా అక్విజిషన్ సిస్టమ్‌ పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో ఎలక్ట్రోమాగ్నటిక్ లూప్‌తో కూడిన సర్వే హెలికాప్టర్ టేకాఫ్ అవుతుంది.

హెలికాప్టర్ ఆధారిత సర్వే

సొరంగం నిపుణుల సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో హెలికాప్టర్ ఆధారిత వీటెమ్ ప్లస్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను మంజూరు చేసింది. ఈ సర్వేలో 24 మీటర్ల వ్యాసం కలిగిన ఒక ప్రత్యేకమైన ట్రాన్స్‌ మీటర్‌ లూప్‌ను హెలికాప్టర్‌కు వేలాడదీసి, సొరంగం మార్గంలో ఎగురవేస్తారు. ఇది భూమిలోకి విద్యుదయస్కాంత సంకేతాలను పంపి 800-1000 మీటర్ల లోతున ఉన్న భూగర్భ సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సమాచారం మిగిలిన మార్గంలో ఉన్న ఏవైనా చీలిక ప్రాంతాలు లేదా చిక్కుకున్న నీటి వనరులను గుర్తించడానికి సహాయపడుతుంది. తద్వారా తవ్వకం పద్ధతిలో మార్పులు చేసి, సురక్షితంగా వేగంగా పనులు కొనసాగించడానికి వీలవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం దేశంలోని ప్రముఖ సొరంగ, రాక్ మెకానిక్స్ ఇంజినీర్లతో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు ఇండియన్ ఆర్మీ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌ను ప్రత్యేక సలహాదారుగా, కల్నల్ పరీక్షిత్ మెహ్రాను సొరంగ నిపుణుడిగా ఏడాదిపాటు నియమించింది.

ప్రాజెక్టు వల్ల ఉపయోగం

సొరంగం పనులు పూర్తయితే నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీటిని పంప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా విద్యుత్ బిల్లుల కోసం రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది. సొరంగం పూర్తయితే ఈ మొత్తం ఆదా అవుతుంది. అంతేకాకుండా ఈ సొరంగం పూర్తయితే ఇంజినీరింగ్ రంగంలో అపూర్వమైన ఘనతతో ప్రపంచపటంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతుంది.

ప్రాజెక్టు లక్ష్యం ఇదీ..

నల్గొండ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు అందించడానికి 1983లో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ లో భాగంగా ఉన్నదే ఎస్ఎల్‌బీసీ సొరంగం. ఈ సొరంగం మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు. మధ్యలో ఎటువంటి అంతరాయ మార్గాలు లేకుండా తవ్విన ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా ఇది రికార్డు సృష్టించనుంది. అయితే.. ప్రస్తుతం శ్రీశైలం (ఇన్‌లెట్) నుంచి సుమారు 13.94 కి.మీ, దేవరకొండ (అవుట్‌లెట్) వైపు నుంచి 20.4 కి.మీ తవ్వకం పూర్తయింది. ఇంకా సుమారు 9.8 కి.మీ తవ్వాల్సి ఉంది.

సొరంగం తవ్వకంలో ఎన్నో సవాళ్లు

ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. అక్టోబర్ 2009లో వరదల వల్ల టీబీఎం నీట మునగడం, భూగర్భంలో అపాయకరమైన ప్రాంతాల కారణంగా పురోగతి నెలకు కేవలం 75 మీటర్లు మాత్రమే ఉంది. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 22న సంభవించిన భయంకరమైన భూగర్భ ప్రమాదంలో నీరు, బురద, శిథిలాలు సొరంగంలోకి ప్రవేశించి 2.5 కి.మీ మేర మునిగిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు, సురక్షితమైన, స్థిరమైన పురోగతి కోసం అధునాతన సొరంగ తవ్వకం పద్ధతులను ఉపయోగించాలని తెలంగాణ కేబినెట్ అక్టోబర్ 23న ఆమోదించింది. 2028 మధ్య కల్లా సొరంగం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

Next Story