జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఆ నేతను బరిలోకి దింపేందుకు సీఎం మాస్టర్ ప్లాన్?

by Naga Rani Yarlagadda |

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్‌లో నవీన్ కుమార్ యాదవ్‌ను బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఆ నేతను బరిలోకి దింపేందుకు సీఎం మాస్టర్ ప్లాన్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్‌లో నవీన్ కుమార్ యాదవ్‌ను బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బీసీ నినాదం సైతం కలిసొస్తుందనే భావనతో నవీన్‌కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరుఫున నవీన్ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2023 ఎలక్షన్స్‌లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ బై ఎలక్షన్‌లో మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యిందనే ప్రచారం జరుగుతున్నది.

మజ్లిస్ నుంచి సానుకూలత!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్‌తో ఉన్న స్నేహ సంబంధాలు తెంచుకొని హస్తం పార్టీతో జత కట్టింది. ఇదే విషయాన్ని పలు సార్లు ఒవైసీ సోదరులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ బై పోల్‌లో కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ సహకారం కోరుతున్నది. ఆ నియోజక వర్గంలో సుమారు 70 వేల మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వారంతా గంపగుత్తగా ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచినట్టే. ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో సీఎం రేవంత్.. ఉప ఎన్నిక అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఆ సమయంలోనే నవీన్ ఎంపిక విషయం సైతం చర్చకు వచ్చినట్టు సమాచారం. అక్కడ మైనార్టీ లీడర్‌కు కాకుండా ఇతరులెవరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అప్పుడు తమ పార్టీ అభ్యర్థిని బరిలో దించబోమని అసద్ క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. అందుకే అక్కడ టికెట్ కోసం తీవ్రంగా లాబీయింగ్ చేసిన అజారుద్దీన్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు సమాచారం.

వచ్చేవారం ముఖ్యమంత్రి సమీక్ష

ఈ నెలాఖరుకు ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందని తెలుస్తున్నది. దీంతో సీఎం బై ఎలక్షన్‌పై ఫోకస్ పెట్టేందుకు నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఉప ఎన్నికపై రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేక మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉప ఎన్నిక కోసం ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌తో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని రోజులుగా ఫీల్డ్‌లో పర్యటిస్తూ, పార్టీ కేడర్‌ను స్ట్రెంథెన్ చేసే పనిలో ఉంది. అలాగే ప్రభుత్వం తరుఫున అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడంలో నిమగ్నమైంది.

సర్వే రిపోర్టులో నవీన్ పేరు

టికెట్ కోసం పోటీ పడిన నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లు ఫైనల్ లిస్టులోకి వచ్చాయి. ఇందులో ఎవరికి టికెట్ ఇస్తే విజయం సులువు అవుతుందని పార్టీ పలు సర్వేలు జరిపింది. అందులో నవీన్ పట్ల మెజార్టీ ప్రజలు పాజిటివ్‌గా స్పందించినట్టు తెలిసింది. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు పార్టీలోని ఓ సీనియర్ లీడర్ పేర్కొన్నారు.

Next Story