- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు జీపీఓలు : సీఎం రేవంత్ రెడ్డి
గత పాలకులు భూముల్ని కొల్లగొట్టేందుకే ధరణిని తీసుకువచ్చారని, ఆ పాపాలు తెలుస్తాయనే వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: గత పాలకులు భూముల్ని కొల్లగొట్టేందుకే ధరణిని తీసుకువచ్చారని, ఆ పాపాలు తెలుస్తాయనే వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైటెక్స్ లో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. గ్రామ పాలన అధికారులుగా సెలెక్ట్ అయినవారికి నియామకపత్రాలను అందజేశారు. సీఎం చేతులమీదుగా 5,106 మంది గ్రామ పాలనా అధికారులు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు ప్రజల భూముల్ని దోచుకునేందుకు తెచ్చిన వైరస్ ధరణి అని యద్దేవా చేశారు. ధరణి గురించి అందరికీ తెలిసిన నిజం ఇదేనని తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం కాకుండా ప్రజల్ని బలిపశువుల్ని చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
విశ్వాసం ఉన్న కుక్కని చంపాలన్నా పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలని అంటారని, అందుకే వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థల్ని దోపిడీదారులుగా చూపించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది ఎంతో పోరాడారని, రాష్ట్రసాధనలో ఉద్యోగులు తమవంతు పాత్ర పోషించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అలాంటి ఉద్యోగుల్ని చెట్టుకొకరిని, పుట్టకొకరిని విసిరేశారని మండిపడ్డారు. నాటి సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ భూ ఆగడాలను గమనించిన ప్రజలు.. భూమిని ఆక్రమించాలనుకున్న వారిని తరిమికొట్టారన్నారు. రాష్ట్రంలో ఎవరిని కదిలించినా.. ధరణి ఒక భూతంగా మారి తమని పట్టి పీడిస్తోందని, ఈ కొరివిదెయ్యం నుంచి విముక్తి కల్పించాలని కోరారన్నారు. అందుకే రాహుల్ గాంధీతో మాట్లాడి.. ఎన్నికల హామీల్లో ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి ప్రత్యామ్నాయంగా మరో చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చామన్నారు.
అధికారంలోకి వచ్చాక.. శ్రీనివాసరెడ్డిని మంత్రిగా నియమించి ధరణి మహమ్మారిని నిర్మూలించాలని విడతలవారిగా చర్చించి, సూచనలు, సలహాలు పాటించి.. భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రప్రజలకు అంకితం చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రజలకు భూమితో ఎంతో అనుబంధం ఉంటుందని గుర్తు చేశారు. ధరణి వల్ల తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఆ తర్వాత జంట హత్యలు కూడా జరిగాయని తెలిపారు. పేద రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా, సారథులుగా ఉండాలని 5 వేల మందిని గ్రామ పాలన అధికారులుగా నియమిస్తున్నామన్నారు.






