సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం ఉండాలి: CM రేవంత్ ఆదేశం

by Gantepaka Srikanth |

ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయ సమ్మక్క - సారలమ్మ మేడారం జాతర(Medaram Jathara)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం ఉండాలి: CM రేవంత్ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయ సమ్మక్క - సారలమ్మ మేడారం జాతర(Medaram Jathara)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమ్మక్క - సారలమ్మ(Sammakka Saralamma) పూజారులను సంప్రదించి వారి సూచనల మేరకు డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లోక్ సభ సభ్యుడు పోరిక బలరాం నాయక్, సలహదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు.

మేడారంలో జాతర అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజన సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సమ్మక్క - సారలమ్మ పూజారులను సంప్రదించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఈనెల 23న మేడారం సందర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు. పూజారుల ఆమోదంతో అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను విడుదల చేయాలని చెప్పారు. జాతర అభివృద్ధి పనులకు సంబంధిత టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని అన్నారు.

అమ్మవార్ల గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని చెప్పారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయ వృక్షాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికపై ఈ నెల 23న మేడారంలోనే మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.

Next Story