కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై CM రేవంత్‌ సమీక్ష.. CBI విచారణకు ఒత్తిడి పెంచాలని నిర్ణయం

by Gantepaka Srikanth |

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై CM రేవంత్‌ సమీక్ష.. CBI విచారణకు ఒత్తిడి పెంచాలని నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీఐ (CBI) విచారణ కోసం ఒత్తిడి పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విచారణ చేపట్టేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఎక్కడా కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో లేవని, కాబట్టి సీబీఐ దర్యాప్తుకు మార్గం సుగమమైందని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు, తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాజకీయంగా కూడా పావులు కదపాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను స్వయంగా కలవాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన సాంకేతిక లోపాలు, నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే వచ్చిన నివేదికలను సీబీఐకి అందజేయాలని నిర్ణయించారు.

అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

ప్రజా ధనం దుర్వినియోగం కావడానికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భారీ ప్రాజెక్టు వైఫల్యాలను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నిర్ణయంతో కాళేశ్వరం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Next Story