PJR ఇల్లు హైదరాబాద్ ప్రజలకు జనతా గ్యారేజ్: CM రేవంత్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-28 13:04:15  IST  )

జంటనగరాల్లో 25 ఏళ్ల పాటు పీజేఆర్(PJR) శకం నడిచిందని.. ఉపాధి కోసం వచ్చిన వాళ్లకు పీజేఆర్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు.

PJR ఇల్లు హైదరాబాద్ ప్రజలకు జనతా గ్యారేజ్: CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: జంటనగరాల్లో 25 ఏళ్ల పాటు పీజేఆర్(PJR) శకం నడిచిందని.. ఉపాధి కోసం వచ్చిన వాళ్లకు పీజేఆర్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఆరు వరుసలు, 24 మీటర్ల వెడల్పుతో 1.2 కి.మీ నిర్మించిన పీజేఆర్ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పేదలపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే పీజేఆర్ వెంటనే స్పందించేవారు.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండేవారు. ప్రజా సమస్యలతో పాటు పార్టీకి ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేం. పీజేఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజీని తలపించేదన్నారు. పీజేఆర్ చేసిన కృషి వల్లే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయి. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పీజేఆర్ చేసిన కృషి మరవలేనిదన్నారు. ఇవాళ నగరంలో సురక్షితమైన మంచినీరు తాగుతున్నారో వారంతా పీజేఆర్‌ను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైటెక్ సిటీగా చెప్పుకునే ఈ ప్రాంతం అభివృద్ధి పథం వైపు నడుస్తూ ప్రపంచ దిగ్గజ కంపెనీలకు వేదికగా మారిన శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాతం గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక భాగం. పీజేఆర్ కృషిచోనే హైటెక్ సిటీ గచ్చిబౌలికి మంజూరైంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పునాది వేస్తే చంద్రబాబు దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. కాలక్రమంలో దీన్ని మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరిగినా పీజేఆర్ అడ్డుపడ్డారు.

Next Story