- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ పరేషాన్.. మధ్యాహ్నం సీఎం రేవంత్ అత్యవసర సమావేశం
పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ, సైనిక పరిణామాలు అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు (LPG), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో అత్యవసర ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. యుద్ధ వాతావరణం వల్ల భవిష్యత్తులో ఇంధన దిగుమతులకు ఆటంకం కలిగితే, రాష్ట్రంలో కొరత తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో, డిపోల్లో ప్రస్తుతం ఉన్న నిల్వల వివరాలను అధికారుల నుంచి సీఎం అడిగి తెలుసుకోనున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించనున్నారు. అలాగే సాగు సీజన్ దృష్ట్యా యూరియా, ఇతర ఎరువుల నిల్వలను కూడా సమీక్షించనున్నారు. పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే ముడి సరుకు నిలిచిపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించనున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులతో పాటు పౌరసరఫరాలు, ఇంధన శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించకుండా, బ్లాక్ మార్కెటింగ్‌కు తావులేకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన సరఫరాలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చేలా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనన్న వందతులతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. బంకులకు క్యూ కట్టి.. ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు క్యాన్లకు క్యాన్లు పెట్రోల్, డీజిల్ ను కొనుక్కుని వెళ్తున్నారు. కొరత భయంతో ముందుగానే అధికమొత్తంలో కొనుగోళ్లు చేయడం వల్లే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుందని రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.






