- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సదస్సుకు రండి.. ప్రధాని మోడీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ప్రధానిని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున పార్లమెంట్ భవనంలోనే ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ అయి ఈనెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్ గురించి రేవంత్ ప్రధానికి వివరించారు. దాదాపు అరగంటపాటు జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణకు అనుమతి, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్- బెంగళూరు-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై విన్నవించారు.
రాహుల్, ఖర్గేకు ఆహ్వానం..
ప్రధానితో భేటీకి ముందు కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‍ను ముఖ్యమంత్రి కలిసి గ్లోబల్ సమ్మిట్‍కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్‍లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి ఆయనకు వివరించారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మాలా సీతారామన్‌తో సీఎం భేటీ అయి సమ్మిట్‌కు రావాలని కోరారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. అలాగే ఏఐసీసీ చీఫ్ ఖర్గేతోపాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ భవనంలోనే వీరితో భేటీ అయి గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు.






