ఒక్కొక్కరి సంగతి చూస్తా: సీఎం రేవంత్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

బ్లాక్‌మెయిలింగ్‌కు తమ ప్రభుత్వం భయపడేది లేదని.. ఇలాంటి బ్లాక్‌‌మెయిల్ ఎక్కడైనా జరగచ్చు కానీ తమ దగ్గర నడువవు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ఒక్కొక్కరి సంగతి చూస్తా: సీఎం రేవంత్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్‌మెయిలింగ్‌కు తమ ప్రభుత్వం భయపడేది లేదని.. ఇలాంటి బ్లాక్‌‌మెయిల్ ఎక్కడైనా జరగచ్చు కానీ తమ దగ్గర నడువవు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం మైనింగ్ డిమాండ్స్‌పై చర్చలో భాగంగా హరీశ్‌రావు మాట్లాడిన అనంతరం రేవంత్‌రెడ్డి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భయపెట్టి అక్రమ పనులు చేయించుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని.. ఆయన ఒప్పుకోకపోవడం వల్లనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ రాష్ట్ర ఆదాయానికి గండిపడినా.. రాష్ట్ర ఖనిజ సంపద, ఇతర ప్రభుత్వ ఆదాయానికి గండిపడే ఎలాంటి తప్పిదాలు జరిగినా తమ ప్రభుత్వం ఉపేక్షించే ఆలోచన చేయలేదని అన్నారు. నేడు ప్రతిపక్ష సభ్యులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించి ఆరోపణలు లేవనెత్తారని.. కానీ, ఈ సంస్థకు నోటీసులు ఇచ్చింది.. దీనికి సంబంధించి చర్యలు తీసుకోమన్నదే తమ ప్రభుత్వమని చెప్పారు. అంతేకాకుండా సీనరేజీ చార్జి కింద రూ.1,52,97,825, పర్మిట్ ఫీజు కింద రూ.1,22,25,446 రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి పన్నులు కట్టించామని వెల్లడించారు. బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పేరు తీసుకొని అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇది వారు కనిపెట్టి, వారు ఫిర్యాదు చేస్తే తాము చర్యలు చేపట్టలేదని తెలిపారు. తమ ప్రభుత్వమే దీనికి సంబంధించిన వివరాలు సేకరించి.. ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి.. బకాయిలు వసూలు చేశామని చెప్పారు. అనుమతులను కూడా పరిశీలించి.. చర్యలు తీసుకోవాలని తామే ముందుకు వచ్చామన్నారు. కానీ, ఇందులో ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదన్నారు. వివాదం లేవనెత్తాలని.. మంత్రి మీద బురదజల్లాలని.. అక్కసు వెల్లగక్కుతున్నారని అన్నారు. వారు అనుకున్న పైరవీలకు మంత్రి సహకరించడం లేదని.. మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలని.. మంత్రిని బ్లాక్‌మెయిల్ చేయాలని వారంతా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేసిందే తమ ప్రభుత్వమని తెలిపారు.

మా మంత్రికి సంబంధం ఉంటే నోటీసులు ఎందుకు ఇస్తాం..

‘మా మంత్రులకు ఇందులో పాత్ర ఉంటే.. ఈ నోటీసులు ఇవ్వడం కానీ, పన్నులు వసూలు చేయడం కానీ చేస్తామా’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో తమ మంత్రికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే.. ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా అని నిలదీశారు. వాళ్ల ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా గండిపడకూడదని ప్రతి రూపాయి ఖజానాకు చేరాలని తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు.

మైనింగ్ లీజులు, అక్రమాలపై సీబీసీఐడీ విచారణ..

బీఆర్ఎస్ వాళ్లు విచారణ కావాలని అడుగుతున్నారని.. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షానికి, ప్రజలకు మాట ఇస్తున్నానని సీఎం రేవంత్ చెప్పారు. విచారణకు ఆదేశించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ‘నాడు సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి, తొక్కించి చంపి ఇసుక అక్రమ రవాణా చేసిన సంతోష్‌రావు, ఆయన తండ్రి రవీందర్‌రావుకు చెందిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధం ఉంది. అలాగే.. సర్వే 168 శిరీష జియో గ్రానైట్స్‌కు సంబంధించి ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను బెదిరించి గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్రమంగా మైనింగ్ లీజును రాయించుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేశారని.. దీని మీద విచారణకు సిద్ధం. అదేవిధంగా మిడ్వెస్ట్ గ్రానైట్స్‌కు సంబంధించి నేడు రెవెన్యూ మంత్రిని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యేకు చెందిన తమ్ముడు ఇల్లీగల్‌గా మైనింగ్ చేసుకున్నాడు. ఇందులో జరిగిన దోపిడీపై మిడ్వెస్ట్ గ్రానైట్స్ మీద విచారణకు ఆదేశిస్తాం. అలాగే, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, వారి కుటుంబసభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికనే కాకుండా ఈడీ విచారణ సైతం జరుగుతోంది. శ్వేత గ్రానైట్స్‌కు సంబంధించి ఇల్లీగల్ మైనింగ్‌పైనా విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే.. ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్‌ అక్రమంగా రాయించుకున్నారు.

ఈ అక్రమ మైనింగుల మీద విచారణ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని వివరించారు. హరీశ్‌రావు సొంత తమ్ముడు మహేశ్‌రావు దోపిడీకి పాల్పడ్డారని.. హరీశ్‌రావు మంత్రిగా దోచిపెట్టారని ఆరోపించారు. వీటన్నింటి మీద సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అందరి నిగ్గుతేలుస్తానని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే బీఆర్ఎస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు హరీశ్‌రావు, ఐదేళ్లు కేటీఆర్ ఈ శాఖను నిర్వహించి వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టారన్నారు. ఇసుక మాఫియాను నడిపి దోపిడీకి పాల్పడ్డారన్నారు. తాము పెంచిన ఆదాయం కళ్ల ముందు ఉన్నదని తెలిపారు. ఇసుకకు సంబంధించి 2024-25లో రూ.721 కోట్ల ఆదాయం ఉంటే.. 2025-26లో రూ.972 కోట్లకు పెంచామన్నారు. ఇసుక దోపిడీకి పాల్పడి ఇంకా కన్‌స్ట్రక్షన్ కుంటుపడిందని.. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని అంటున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ దెబ్బ తింటే తాము ఇసుకను ఏమైనా బుక్కుతున్నామా..? బిర్యానీ వండుకొని తింటున్నామా..? అని ప్రశ్నించారు. ఏడాదికి రూ.1,000 కోట్లను కేవలం ఇసుక దందాలోనే హరీశ్‌రావు, కేటీఆర్ దోపిడీకి పాల్పడ్డారని.. ఈ మాఫియాకు నాయకత్వం వహించిందే వీరని పేర్కొన్నారు. మొదట్లో ఈ శాఖ హరీశ్‌రావు దగ్గర ఉండేదని.. ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని కేసీఆర్ ఆ శాఖను తొలగించారని అన్నారు. ఈ విషయంలో కొడుకు, అల్లుడు మధ్య పంచాయితీ పడితే దానిని తెంపడానికి ఆ శాఖను కేటీఆర్‌ దోచుకునేందుకు అవకాశం ఇచ్చారని ఆరోపించారు. జూన్ 2, 2014 నుంచి ఇప్పటివరకు మైనింగ్ లీజుల మీద, జరిగిన అక్రమాల మీద, ఆయా అక్రమ మైనింగుల మీద పూర్తిస్థాయిలో సీబీసీఐడీతో విచారణ జరిపించి.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి నివేదికను ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. గత పదేళ్లు వారు పాల్పడిన దోపిడీ బయటపడుతున్నదని.. అందుకే ఈ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ అన్నారు. ఏ బురద జల్లినా ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

సొంత చెల్లిని గెంటేశారు..

మంత్రిని భయపెట్టి భూములు రాయించుకోవాలనుకునే ప్రయత్నాలు తమ వద్ద ఉడకవని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఆ కంపెనీతో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని సదరు మంత్రి గతంలోనే చెప్పారని అన్నారు. బంధువులు, దూరపు బంధువులు ఉంటే వారిది అయిపోతదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కానీ, ఏపీలో కానీ ఏ రెడ్డి అయినా ఇంకో రెడ్డికి దగ్గర లేదా దూరపు బంధువు ఉంటారని అన్నారు. ‘సొంత అన్నదమ్ముళ్లకే ఆదాయంలో, పంపకాలల్ల తేడాలు వస్తున్నాయి. అంతెందుకు కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత రావు మధ్య ఆదాయ పంపకాల్లో తేడా వస్తే సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు గెంటేశారు’ అని అన్నారు. పొంగులేటికి సంబంధించి ఎవరో బంధువులకు వ్యాపారం ఉంటే.. పొంగులేటికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. వీళ్లు సొంత చెల్లిని ఇంట్లో నుంచి పార్టీలో నుంచి వెళ్లగొట్టి.. దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. ఎవరో చేస్తున్న వ్యాపారాన్ని పొంగులేటికి అంటబెట్టాలని చూస్తున్న ప్రయత్నం దిక్కుమాలిన చర్య అని హెచ్చరించారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నాలు చేయొద్దని.. వీటిలో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఇసుక, లీజు మాఫియాలో చేసిన ప్రయత్నాలన్నీ తేలుస్తామని.. ఒక్కొక్కరి సంగతి చూస్తామని హెచ్చరించారు.

Next Story