సీఎం రేవంత్‌ రెడ్డి.. సిగ్గు, పౌరుషం లేదా: ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-17 06:08:33  IST  )

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన మీటింగ్‌లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు, పౌరుషం లేదా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.

సీఎం రేవంత్‌ రెడ్డి.. సిగ్గు, పౌరుషం లేదా: ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి నిర్వహించిన మీటింగ్‌లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు, పౌరుషం లేదా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె బంజారా హిల్స్‌లోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల అంశంపై తాము చర్చలకు వెళ్లేది లేదని సీఎం రేవంత్ రెడ్డి మొదట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని.. కానీ, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా రాత్రికి రాత్రి ఢిల్లీకి వెళ్లి ఏపీతో చర్చల్లో పాల్గొన్నారని ఫైర్ అయ్యారు. పైగా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొని పండగ వాతావరణంలో ఒకరికొకరు సన్మానాలు చేసుకున్నారని కవిత మండిపడ్డారు.

రేవంత్ వెంటనే రాజీనామా చెయ్..

జలశక్తి మీటింగ్ అజెండాలో తొలి అంశమే బనచర్లపై ఉంటే.. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సమావేశాన్ని బహిష్కరించాల్సింది పోయి తీరిగ్గా కూర్చొని అప్పనంగా కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి గిఫ్ట్ కింద ఇచ్చేశారని ఆరోపించారు. ఒకవేళ గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణమే జరిగితే గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులు శాశ్వతంగా హరించుకుపోతాయని అన్నారు. జలశక్తి సమావేశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ప్రెస్ నోట్ విడుదల చేసిందని, అందులో క్లియర్‌గా బనకచర్లపై చర్చ జరిగినట్లుగా ఉందన్నారు. కానీ, సీఎం రేవంత్ అసలు మీటింగ్‌లో బనకచర్ల ప్రస్తావనే రాలేదని బుకాయించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపణలు గుప్పించారు. తెలంగాణకు జరుగుతోన్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డికి అసలు సీరియస్‌నెస్ లేదని.. రాష్ట్రాన్ని పాలించే హక్కు ఏనాడో కోల్పోయారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బనకచర్ల వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా లాభం లేదని, కుట్ర పూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అని అన్నారు. గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టును తక్షణమే ఆపాలని లేని పక్షంలో జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఏవీ మీ విజయాలు..

జలశక్తి మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు విజయాలు సాధించామంటూ గొప్పలు చెబుతున్నారని.. అందులో కొత్తవి ఏమి లేవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేసే అంశం ఇప్పటిది కాదని.. ఫేజ్-1 పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయని, ఇది ఫేజ్-2 అని తెలిపారు. ఇక కేఆర్ఎంబీ కార్యాలయం ఆంధ్రాలో, గోదావరి రివర్ బోర్డు తెలంగాణలో ఉండే అంశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నదేనని పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్రా భూభాగంలో శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు ఆ రాష్ట్రం, తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మరమ్మతులు మనం చేయాలని అదే చట్టంలో పొందుపరిచారని వివరించారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి తమ విజయాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఆఫీసర్స్ కమిటీ నదుల అనుసంధానంపై ఏనాడో ఏర్పాటు చేశారని.. అందులో కొత్తగా తెలంగాణకు తీవ్ర నష్టం చేకూర్చే బనకచర్ల ప్రాజక్టు వచ్చి చేరిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏం లేదని తెలంగాణ జల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టి రావడం ఒక్కటే కొత్తదనమని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు.

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదే..

సీఎం రేవంత్ రెడ్డి జలశక్తి మీటింగ్‌కు వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాలకు కాదని.. మెఘా కంపెనీ చేపడుతోన్న రూ.85 వేల కోట్ల ప్రాజెక్ట్‌లో తన వాటా కోసమని కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని.. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై అంశంపై తాడోపేడో తేల్చుకురావాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైందనేనని కవిత అన్నారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిపుణులతో చర్చించాకే తాను ఆర్డినెన్స్‌కు పూర్తి మద్దతు ఇచ్చానని అన్నారు. చివరికి బీఆర్ఎస్ వాళ్లు తన దారిలోకి రావాల్సిందేనని తెలిపారు. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదని.. ఆ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Next Story