సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.

సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ హీటు పుట్టిస్తున్నాయి. బుధవారం రాత్రి యూసఫ్ గూడ చెక్ పోస్టులో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. సినిమా ఇండస్ట్రీని ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని, పదేళ్ల పాలనలో కేసీఆర్ సినీ ఇండస్ట్రీకి నంది అవార్డులే ఇవ్వలేదని, తమ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిందని తెలిపారు.

కేటీఆర్ సినిమా హీరోలతో తిరిగాడు కానీ సినిమా కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపిస్తే.. సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అలాగే సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి.. ఆర్టీసీ రూ.6 వేల కోట్లు చెల్లించామన్నారు. మహిళా సంఘాలకు రూ.1000 కోట్ల భూమి ఇచ్చి వాళ్ల ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించామని గుర్తుచేశారు. అలాగే రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ తెలిపారు.

పేదోళ్ల గుండె ధైర్యం పీజేఆర్ అన్న రేవంత్ రెడ్డి.. 2007లో పీజేఆర్ మరణించినపుడు ఏకగ్రీవం చేయడానికి చంద్రబాబు అభ్యర్థిని నిలబెట్టలేదని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ మాత్రం పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు ఎండలో నిలబెట్టి అవమానించాడన్నారు. ఇప్పుడు ఉపఎన్నికలో మాత్రం పీజేఆర్ కుటుంబం పైన అభ్యర్థిని నిలబెట్టాడన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. రెండూ కలిసి కాంగ్రెస్ ను ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పై సీబీఐ ఎందుకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించారు. గజదొంగ అయిన కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదో కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నే ఓడించి ఫాంహౌస్ కు పంపిన తమను.. కిషన్ రెడ్డి భయపెట్టలేరన్నారు. కింగ్ అవుతానని కిషన్ రెడ్డి అంటున్నాడు కానీ బొంగు కూడా కాడని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే గెల్చుకున్నట్లేనన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారమవుతాయని, 30 వేల మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత జూబ్లీహిల్స్ ఓటర్లపైనే ఉందన్నారు.

Next Story