మంత్రివర్గ విస్తరణపై ముహూర్తం ఖరారు.. ఆ ఆరుగురిలో ఒక మైనారిటీకి అవకాశం!

by Disha Web Desk 2 |
మంత్రివర్గ విస్తరణపై ముహూర్తం ఖరారు.. ఆ ఆరుగురిలో ఒక మైనారిటీకి అవకాశం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రివర్గాన్ని ఈ నెల 31లోపు పూర్తిస్థాయిలో విస్తరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ పెద్దలకు తెలియజేశారు. ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే అంశంలో పీసీసీ, ఏఐసీసీలో స్పష్టతే ఉన్నది. అందులో ఒకరు మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు ఉండనున్నారు. ఎమ్మెల్యేల్లో మైనారిటీలు ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్సీ కోటా నుంచి తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. నామినేటెడ్ కోటాలో తీసుకోవడానికి గతంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సీఎం ఆచితూచి అడుగేస్తున్నారు. త్వరలో దీనిపై స్పష్టత రానున్నది.

ఏఐసీసీ క్లియరెన్స్ రాగానే..

మంత్రులుగా ఎవరుండాలనే అంశంలో క్లారిటీ ఉన్నందున ఏఐసీసీ క్లియరెన్స్ రాగానే మంత్రివర్గ విస్తరణను ఈ నెల 31లోపు సీఎం పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ అప్పటిలోపు ఏఐసీసీ నుంచి నిర్ణయం వెలువడకపోతే అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉండొచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. కానీ సీఎం రేవంత్ మాత్రం మ్యాగ్జిమమ్‌గా వంద రోజుల గడువులోగానే పూర్తి కేబినెట్ ఏర్పడడం ఖాయమన్న సంకేతాన్ని ఇచ్చారు. ఆరు గ్యారెంటీల అమలు తరహాలోనే మంత్రివర్గం సైతం పూర్తిస్థాయిలో ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఆరుగురిపై ఏకాభిప్రాయం!

కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే ఆరుగురు ఎవరనే అంశంలో పీసీసీ, ఏఐసీసీకి ఏకాభిప్రాయమే ఉన్నది. పలుమార్లు ఈ విషయమై రాష్ట్ర, జాతీయ నేతల మధ్య చర్చలు కూడా జరిగాయి. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నామినేటెడ్ కోటా నుంచి ఎంపిక చేయడంలో పొలిటికల్ యాక్టివిటీస్ అడ్డం పడుతున్నాయి. షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, మస్కత్ అలీ, జాఫర్ జావీద్ తదితరుల పేర్లు చర్చల్లో నలుగుతున్నాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినవారిని తీసుకోరాదనే నిబంధన సంకటంగా మారింది. కామారెడ్డి టికెట్‌ను త్యాగం చేసిన షబ్బీర్ అలీ సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని కేబినెట్ లోకి తీసుకుంటే అదే జిల్లాకు చెందిన సుదర్శన్‌ రెడ్డికి చాన్స్ ప్రశ్నార్థకంగా మారుతుంది. హైదరాబాద్‌లో పార్టీ వీక్‌గా ఉన్నందున ఈ ప్రాంతానికి చెందినవారికి అవకాశమివ్వాలన్న వాదనా ఉన్నది.

స్పష్టత వచ్చాక..

ఒకవేళ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యేందుకు చిక్కులుంటే ఎమ్మెల్యే కోటాలోనైనా తీసుకోవాలన్న ఆలోచన పార్టీలో వ్యక్తమవుతున్నది. ఇప్పటికే అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న, ఈరవర్తి అనిల్, ప్రొఫెసర్ కోదండరాం తదితరుల పేర్లు ఎమ్మెల్సీ జాబితాలో (ఎమ్మెల్యే, స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్ కోటాలు) కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ, పీసీసీ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది. ఈ నెల చివరికల్లా స్పష్టత వస్తే అధికారికంగా ప్రకటన వెలువడి కేబినెట్ విస్తరణ కూడా కొలిక్కి రానున్నది. ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఈ నెల చివరికల్లా అటు మంత్రివర్గ విస్తరణతో పాటు వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్‌లుగా నామినేటెడ్ పోస్టులివ్వడం, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం పూర్తికావాలని భావిస్తున్నారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీ

రాష్ట్రంలో సుమారు 90కు పైగా కార్పొరేషన్లకు చైర్ పర్సన్లను నియమించాల్సి ఉన్నది. పార్టీకోసం కష్టపడినవారికి అవకాశం ఇస్తామని ఎన్నికల ప్రచారం సమయంలోనే రేవంత్‌ రెడ్డి, పార్టీ నేతలు హామీ ఇచ్చారు. వీటిలో ప్రధానమైన సంస్థలకు చైర్‌పర్సన్లను నియమిస్తూ వీలైనంత తొందరగా ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడే సమయానికి కనీసంగా పాతిక, ముప్పై వరకైనా కొలిక్కి వస్తే పార్టీ కేడర్‌లో కాన్ఫిడెన్స్ వస్తుందని, ఉత్సాహంగా ఎంపీ ఎన్నికల సమయంలో పనిచేస్తారని, తదుపరి నియామకాల్లో అవకాశాల కోసం మరింతమంది కష్టపడి పనిచేస్తారని ఇటీవల టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జనవరి 31లోగా కచ్చితంగా వీటిని భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed