తెలంగాణ విద్యా రంగంలో AI విప్లవం: రఘురామ్ రాజన్‌తో CM రేవంత్ కీలక భేటీ

by Gantepaka Srikanth |

ప్రాథమిక, ఉన్నత పాఠ‌శాల‌, సాంకేతిక విద్య‌తో పాటు వైద్య విద్య సిల‌బ‌స్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, దాని ఉప‌యోగంపైన ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని, ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ని కోరారు.

తెలంగాణ విద్యా రంగంలో AI విప్లవం: రఘురామ్ రాజన్‌తో CM రేవంత్ కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రాథమిక, ఉన్నత పాఠ‌శాల‌, సాంకేతిక విద్య‌తో పాటు వైద్య విద్య సిల‌బ‌స్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, దాని ఉప‌యోగంపైన ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని, ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ని కోరారు. తెలంగాణ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళికపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య‌మంత్రి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఏఐ వినియోగంతో పాటు మిడిల్ లెవ‌ల్ ఉద్యోగాల కల్ప‌న కోసం స్కిల్స్ యూనివ‌ర్సిటీ, ఏటీసీల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి వివ‌రించారు. స‌రైన ప‌ద్ద‌తిలో ఏఐని వినియోగిస్తే అంద‌రికి మేలు జ‌రుగుతుంద‌ని రాజన్ చెప్పారు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో పారిశ్రామిక విధానం ఉంటే మ‌రిన్ని పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చున‌ని తెలిపారు. డేటా సెంటర్స్ కోసం పెద్ద ఎత్తున విద్యుత్, నీటి వినియోగం ఉంటుంద‌ని చెప్పారు. మూడు నాలుగు నెల‌ల్లో హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తాన‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని విజ్ఞప్తి..

నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు ఉన్నాయ‌ని రఘురామ్ రాజన్ వివరించారు. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవాలంటూ పలు సూచనలు చేశారు. ప్ర‌భుత్వాలు అనుసరించే సుల‌భ‌త‌ర వ్యాపార విధానాలపై ఆధార‌ప‌డి కొత్త‌ ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని చెప్పారు. స్టార్టప్ లను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం ఉంటుంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల కోసం కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు. కావాల్సిన భూమితో పాటు మౌలిక స‌దుపాయాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నామ‌న్నారు. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, అవుట‌ర్ రింగ్ రోడ్డుతో పాటు అనేక స‌దుపాయాలు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభ‌జించి అభివృద్ధి పైన దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) విధానంలో ముందుకు వెళ్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి క‌ష్ట‌పడుతున్నార‌న్నారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి కోసం త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని రఘురామ్ రాజన్‌ని కోరారు.

అనుకూల ప‌రిస్థితులు..

సుల‌భ‌త‌ర వ్యాపారానికి తెలంగాణలో అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ బాబు వివరించారు. ఫార్మా , ఐటీ, డేటా సెంటర్ల కోసం కావాల్సిన మంచి వాతావ‌ర‌ణం, వ‌స‌తులు క‌ల్పిస్తున్న‌ట్లు రఘురామ్ రాజన్‌కి వివ‌రించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంవో ముఖ్య కార్య‌ద‌ర్శి శేషాద్రి, సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీలు జయేష్ రంజన్, వాణీ ప్ర‌సాద్ పాల్గొన్నారు.

Next Story