CM Revanth Reddy: రైతుభరోసాపై రేవంత్ రెడ్డి శుభవార్త... ఆ తేదీ లోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు

by Prasad Jukanti |   (  Updated:2025-01-31 14:17:50  IST  )

రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

CM Revanth Reddy: రైతుభరోసాపై రేవంత్ రెడ్డి శుభవార్త... ఆ తేదీ లోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 31 లోపు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుభరోసా (Rythu Bharosa) నిధులు జమచేసే పూచీ నాది అని అన్నారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రం అప్పగిస్తే కేసీఆర్ (KCR) తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు. ఏనాడు కేసీఆర్ మనం అప్పుల్లో ఉన్నామని చెప్పలేదు. మన దగ్గర సంచుల కొద్ది, గుమ్మిల గొద్ది డబ్బులు ఉన్నాయని అబద్దాలు చెప్పాడు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీగా ఉన్నాయి. ఆ గుమ్మీల కింది పందికొక్కుల్లా కేసీఆర్ కుటుంబం మిగులు బడ్జెట్ ను తిని కూర్చుంది. అయినా అధైర్యపడకుండా ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశాం. రూ. 15 వేల రైతుభరోసా ఇస్తామని చెప్పాం. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేసీఆర్ ఇచ్చిన రూ. 10 వేలకు పెంచి ఎకరానికి ఏడాదికి రూ. 12 వేలు ఇచ్చేలా రైతుభరోసా కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభించుకున్నామన్నారు. కేసీఆర్ మాదిరిగా నేను ఎగ్గొట్టేవాడ్ని కాదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, జడ్పీటీసీలు నూటికి నూరు శాతం గెలిపించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాఖీసవంత్ కు కూడా లైకులు వస్తాయి:

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ' కేసీఆర్ సరిగ్గా నిలబడే పరిస్థితి లేదు. ఇక బలంగా కొట్టే దమ్ముందా? ఫామ్ హౌస్ లో నీ మంది మాగదులు పోగేసుకుని సోదిచెప్పుడు కాదు ముందు నిలబడడం నేర్చుకో. ఫామ్ హౌస్ లో పడుకుని గంభీరంగా చూస్తున్నానంటున్నావ్ ఎవరిని చూస్తున్నావ్. ప్రజలు డిపాజిట్లు దక్కకుండా చేస్తే ముఖం చెల్లకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నావ్. చివరకు సోషల్ మీడియాలో ఎక్కువ లైకులు వచ్చాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చావ్. సోషల్ మీడియాలో రాఖీసావంత్ (Rakhi Sawant) కు కూడా లైకులు వస్తాయి. తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో మర్చిపోయింది. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ సంబంధాలు తెగిపోయాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఎస్సీ వర్గీకరణ, కులగణనపై అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నాం. నీకు చేతనైతే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రా.. మా పాలనపై నువ్వో మేమే తేల్చుకుందాం' అని కౌంటర్ ఇచ్చారు.

Next Story