- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నియామకాలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
అవసరమైన చోట మాత్రమే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అవసరమైన చోట మాత్రమే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ అవసరమో, ఎక్కడ అనవసరమో గుర్తించే బాధ్యత అధికారులకే అప్పగించారు. ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని క్లారిటీ ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌ను ఇష్టానుసారంగా భర్తీ చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనితో ఏయే శాఖలో పొరుగు సేవలు అవసరమో గుర్తించే బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీకి అప్పగించారు. ఈ మధ్య ఆ కమిటీతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ పొరుగు సేవల నియమకాల అవసరాన్ని కమిటీ గుర్తించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.
వడపోతలో కమిటీ బిజీ
గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నియమకాలు చేపట్టడం వల్ల క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు విమర్శలు వ్యక్తమయ్యాయి. కొన్ని శాఖల్లో అధికారులు, ఎజెన్సీలు కుమ్మక్కై ఒకే పేరుతో ఉన్న వ్యక్తులకు రెండు మూడు ఆఫీసుల్లో జీతాలు చెల్లిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని శాఖల్లో జీతాలు డ్రా చేస్తున్నారు కానీ, సిబ్బంది మాత్రం పనిచేయడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్.. రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మధ్య కమిటీతో జరిగిన సమీక్ష సమావేశంలో “ఎవరిని తొలగించమని నేను చెప్పను, అలాగే ఎవరిని తీసుకోవాలని కోరను. అవసరం ఉందో లేదో మీరే గుర్తించాలి’’ అని సూచించినట్టు తెలిసింది. అందులో భాగంగా ప్రతి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలను కమిటీ సేకరిస్తున్నది. ఎంత మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు? వారి నియమకాలకు ఫైనాన్స్ శాఖ అనుమతి ఉందా? ఎంత మంది ఆధార్, బ్యాంక్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు? ఏయే శాఖల్లో పనిభారం ఉంది? ఎక్కడ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరం? అనే కోణంలో కమిటీ రిపోర్టును తయారు చేస్తున్నది.






