- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్ దూరదృష్టి.. తొలిప్రాధాన్యం మహిళలకే
రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీం కింద ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ప్రత్యేకంగా ట్రావెల్ కార్డులు జారీ చేయనున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఇందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)తో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ కార్డులు మహాలక్ష్మి స్కీం సమర్థవంతంగా అమలుకు టెక్నాలజీ సాయం చేయనున్నాయి. సీఎం రేవంత్ ఆలోచనలకు రూపమైన కామన్ మొబిలిటీ కార్డ్ (సీఎంసీ)లను మహాలక్ష్మి స్కీం ద్వారా వినియోగంలోకి తెచ్చే అవకాశముందని అధికార వర్గాలు ‘దిశ’కు తెలిపాయి. ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటి రవాణా సేవలకు కూడా ఈ కార్డును వినియోగించేలా రూపొందించాలనేది సీఎం లక్ష్యం. భవిష్యత్‌లో ఇతర ప్రభుత్వ సేవలకూ లింక్ చేసే డిజిటల్ ప్లాట్‌ఫాంగా సీఎంసీని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి దూరదృష్టి నుంచి వచ్చిందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
జీరో టికెట్ల జారీలో ఇబ్బందులు..
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాలకు రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు సుమారు రూ.8,500 కోట్ల విలువైన 255 కోట్ల ఉచిత ప్రయాణాలు (ఉచిత టికెట్ల జారీ) జరిగాయి. ఈ పథకం వలన మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. పెద్దఎత్తున మహిళలు బస్సుల్లో ప్రయాణాలు చేయడంతో కండక్టర్లు టికెట్లు జారీ చేసే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆధార్ కార్డులో ఫొటో సరిగా లేకపోవడం, నకిలీ ఆధార్ కార్డులతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ప్రయాణించడం, కొందరు ఆధార్ కార్డు లేకున్నా తమను అనుమతించాల్సిందేనని కండక్టర్లతో గొడవకు దిగటం వంటి కారణాలతో కండక్టర్లకు డ్యూటీ నరకంగా మారింది. దీంతో రాష్ట్ర మహిళలకు ప్రత్యేకంగా కామన్ మొబిలిటీ కార్డుల(సీఎంసీ)ను ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. తొలి దశలో ఈ కార్డులను మహిళలకు అందచేసి తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం.
సీఎంసీ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
సీఎంసీ కేవలం ట్రావెల్ కార్డు మాత్రమే కాదు. ఇది డిజిటల్ ఐడెంటిటీతో కూడిన మొబిలిటీ వాలెట్ వంటిది. ఈ కార్డు ద్వారా రాష్ట్రానికి చెందిన మహిళలు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక ఆధార్ ప్రయాణాలకు చాన్స్ ఉండదు. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించే ఈ ‘సీఎంసీ’ (కామన్ మొబిలిటీ కార్డు)లో డబ్బులను ముందుగా యాడ్ చేసుకుని మెట్రో, ఎంఎంటీఎస్‌లో టికెట్లు తీసుకోవచ్చు. భవిష్యత్‌లో దీనిని ఇతర ప్రభుత్వ సేవలకు లింక్ చేసే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
సీఎంసీతో విస్తృత ప్రయోజనాలు..
డేటా ఆధారిత రవాణా వ్యవస్థకు సీఎంసీ పునాది వేస్తుంది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో మహిళలు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుంటున్నారు. కానీ, కామన్ మొబిలిటీ కార్డు వచ్చాక ప్రతి ప్రయాణం డిజిటల్‌గా రికార్డు అవుతుంది. దీంతో మహిళలు ఏ రూట్లలో ఎక్కువగా ప్రయాణిస్తున్నారో ఖచ్చితమైన డేటా లభిస్తుంది. రద్దీ రూట్లలో మరిన్ని బస్సులు నడపవచ్చు. రద్దీ తక్కువగా ఉండే రూట్లలో బస్సులను సర్దుబాటు చేయవచ్చు. ఫలితంగా బస్సుల వృథాను అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆర్టీసీ సేవలు డేటా ఆధారంగా మరింత సమర్థవంతంగా మారుతాయి.
మహిళల కార్డు ఎందుకు కీలకం?
ఇప్పటివరకు మహాలక్ష్మి పథకంలో లబ్ధిదారుల సంఖ్య, రూట్ల వారీగా ప్రయాణ డేటా స్పష్టంగా లేదు. మొదట్లో కొన్ని చోట్ల కండక్టర్లు మహిళా ప్రయాణికులు తక్కువగా ఉన్నా కూడా జీరో టికెట్లు పెద్ద ఎత్తున జారీ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇకపై సీఎంసీ వచ్చాక ప్రతి ప్రయాణం ట్రాక్ అవుతుంది. ఇది భవిష్యత్ పాలసీలకు బలమైన పునాదిగా మారనుంది. ముందుగా మహిళలతో ప్రారంభమై, ఆ తర్వాత తెలంగాణ ప్రజల చేతికి ఒకే స్మార్ట్ కార్డు తీసుకురావాలనే ఆలోచనలో సర్కారు ఉండగా.. ఇది చాలా అత్భుతమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ నుంచి మెట్రోవరకు, ఉచిత ప్రయాణం నుంచి డిజిటల్ గవర్నెన్స్ వరకు తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కామన్ మొబిలిటీ కార్డులను రాష్ట్రంలో పంపిణీ చేస్తే నిజంగానే అదో పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.






