రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా? : మాజీ మంత్రి హరీశ్​ రావు

by Naga Rani Yarlagadda |

చిన్నకాంట్రాక్టర్ల పట్ల రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా? : మాజీ మంత్రి హరీశ్​ రావు
X
  • మన ఊరు మన బడి కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 'మన ఊరు - మన బడి' పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్ల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేమెంట్ సిద్ధంగా ఉన్నా నిధులు విడుదల చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని కమీషన్లు రావని చిన్న కాంట్రాక్టర్లను వేధిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

బుధవారం తన నివాసంలో కలిసిన బాధితుల సమస్యల విన్న అనంతరం హరిశ్​ రావు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం కింద పనులు పూర్తి చేసినా, దాదాపు రూ.512 కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని హరీశ్ రావు ఆరోపించారు. అప్పులు తెచ్చి, వడ్డీలకు డబ్బులు కడుతూ పనులు చేశామని, ఏడాది కాలంగా బిల్లులు రాక కుటుంబాలు రోడ్డున పడే స్థితికి చేరుకున్నాయని కాంట్రాక్టర్లు హరీశ్ రావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే క్లియర్ చేస్తున్న ప్రభుత్వం, సామాన్యులను ఎందుకు పట్టించుకోవడం లేదని వారు నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని అడ్డుకోవడం అంటే పేద పిల్లల విద్యను అడ్డుకోవడమేనని హరీశ్ రావు అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి గురుకులాల్లో పిల్లల తిండిపై గానీ, పాఠశాలల మౌలిక సదుపాయాలపై గానీ కనీస అవగాహన లేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు న్యాయం జరిగే వరకు బిఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీలో పోరాడుతామని హరిశ్​ రావు హామీ ఇచ్చారు.

Next Story