వాళ్ల ఏడుపు నాకు వినసొంపుగా ఉంది: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు మకుటాయమానంగా నిలిచే 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు.

వాళ్ల ఏడుపు నాకు వినసొంపుగా ఉంది: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు మకుటాయమానంగా నిలిచే 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్న విపక్ష నేతలను ముఖ్యమంత్రి పురాణాల్లోని రాక్షస పాత్రలతో పోల్చారు. శుక్రాచార్యుడు ఫామ్‌హౌజ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి "మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతూ విషం చిమ్ముతున్నారు" అని మండిపడ్డారు. తాము ఫ్యూచర్ సిటీ కడతామంటే కొందరు ఏడుస్తున్నారని, అధికారం కోల్పోయిన బాధలో వాళ్లు అసూయతో ఏడుస్తుంటే తన చెవులకు అది వినసొంపుగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రపంచంతో పోటీ పడేలా నాలుగో నగరం..

హైదరాబాద్ అభివృద్ధి ఏ ఒక్కరితో ఆగిపోదని సీఎం స్పష్టం చేశారు. గతంలో చాలామంది నేతలు హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని, ఇప్పుడు తమ ప్రభుత్వం నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా, అత్యాధునిక వసతులతో ఈ నగరం నిర్మితమవుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణాన్ని వచ్చే జూన్ 2వ తేదీలోపు (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి) పూర్తి చేయాలని లక్ష్యంగా విధించారు. పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో భద్రత మెరుగుపడటమే కాకుండా, పెట్టుబడులకు మరింత భరోసా లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story