- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: నేడు హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి.. ఆ కాన్ఫరెన్స్‌కు హాజరు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

దిశ, ఢిల్లీ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇండియాటుడే కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం అధిష్ఠానంతో వివిధ అంశాలపై చర్చించేందుకు శనివారం మళ్లీ హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులు, మంత్రివర్గ విస్తరణ, సర్కారు సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు, పీసీసీ కార్యవర్గం కూర్పుపైనా డిస్కస్ చేసే అవకాశముంది. కాగా, ఈ అంశాలపై ఇప్పటికే పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధిష్ఠానానికి రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది.
9న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన..!
ఎమ్మెల్యే కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్లకు ఈనెల 10న చివరి గడువుగా ఉన్నది. దీంతో 9వ తేదీ రాత్రి లోపు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది. అయితే ఒక సీటు తమకు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నది. అసెంబ్లీ కోటాలో ఇవ్వడం సాధ్యం కాదని, త్వరలో ఖాళీకానున్న గవర్నర్ కోటాలో కేటాయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.
‘రెడ్డి’లకు రెండు మంత్రి పదవులు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో ఆయనతో కలుపుకుని ఓసీ వర్గం నుంచి ఏడుగురు మంత్రులున్నారు. ఇందులో నలుగురు రెడ్లు, ఒకరు కమ్మ, ఒకరు వెలమ, ఒకరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలున్నాయి. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో రెండు పదవులు మాత్రమే ఓసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నది. అందులో ఉత్తర తెలంగాణ నుంచి ఒకరు, దక్షిణ తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్ ఉంటుంది. మిగతా నాలుగు మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇస్తారని సమాచారం. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఇతర ఎమ్మెల్యేలకు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరికొంత మందికి ప్రభుత్వ సలహాదారులుగా, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులుగా నియమించే చాన్స్ ఉన్నది. మరికొందరు సీనియర్ లీడర్లను పీసీసీ కార్యవర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.
హస్తినకు ఆశావహులు
సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీకి వస్తుండడం, హైకమాండ్ సైతం పదవుల భర్తీపై ఫోకస్ పెట్టడంతో ఆశావహులు హస్తిన బాట పట్టారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు లీడర్లు, ఎమ్మెల్యేలు రెండు రోజుల క్రితమే వచ్చారు. మరికొంత మంది సైతం వస్తున్నట్లు ప్రచారం ఉంది. కీలక నేతలకు ఫోన్లు చేసి పలువురి అపాయింట్‌మెంట్ ఇప్పించాలని వారు కోరుతున్నట్లు సమాచారం.
విజయశాంతికి ఢిల్లీ ప్రతినిధి పదవి?
మాజీ ఎంపీ విజయశాంతికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆమెకు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన విజయశాంతి పలువురు ఏఐసీసీ లీడర్లను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగినట్లు సమాచారం. అసెంబ్లీ కోటాలోని ఎమ్మెల్సీ పదవికీ ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.






