బీసీలకు రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు రిజర్వ్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం

by Naga Rani Yarlagadda |

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. మరింత సమయం పట్టనుందని అంచనా వేస్తున్నారు.

బీసీలకు రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు రిజర్వ్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. మరింత సమయం పట్టనుందని అంచనా వేస్తున్నారు. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌లు నిర్ణీత కాలపరిమిలోగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్​సాధించాలనే క్రమంలో భాగంగానే సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్ద ఐదునెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్ వద్ద పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసే బిల్లు పెండింగ్‌లో ఉంది. రాష్ట్రపతి, గవర్నర్‌ల వద్ద ఫైల్స్, బిల్లులు నెలల కొద్దీ పెండింగ్‌లో పెట్టడానికి లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను చెప్పాలని సుప్రీం అడిగింది. సుప్రీంకోర్టులో వాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేశారు.

బిల్లుల ఆమోదంపై ఆశాభావం..

గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఫైల్స్, బిల్లులు, ఇతర నిర్ణయాలకు చట్టంలో ఎక్కడా నిర్ణీత గడువు లేదు కాబట్టి ఇష్టమొచ్చినప్పుడు, నెలల పాటు పెండింగ్‌లో పెడతాం.. మా ఇష్టం అన్నట్లుగా చేయడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం చెప్పినట్లుగా వినే గవర్నర్‌లు ఉన్నారని, వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలనలో ఇబ్బంది పెట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వివిధ ప్రాంతీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు, న్యాయ కోవిదులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన చేసి దాని ఆధారంగా ఉభయ సభల్లో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ బిల్లులను కేబినెట్ ఆమోదించింది. ఉభయ సభలు ఏకగ్రీవంగా బిల్లులను ఆమోదించాయి. అయితే ఈ బిల్లులను గవర్నర్.. రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి వద్దకు చేరకుండా హోంశాఖ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి 5 నెలలైనా ఆమోదం లభించడంలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పులో వారికి నిర్ణీత గడువు విధిస్తే తెలంగాణ బిల్లులకు ఆమోదం లభిస్తుందనే ఆశాభావంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారు.

అఫిడవిట్ వేయనున్న ప్రభుత్వం

బీసీలకు హామీ ఇచ్చిన విధంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చనే అంచనాలో సీఎం ఉన్నారు. త్వరలో తీర్పు వస్తుందనే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసి కూడా వారం రోజులు కావస్తున్నందున త్వరలోనే తీర్పు వస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన గడువు ముగియవస్తుంది. దీంతో ఎన్నికలు నిర్వహించకపోవడానికి గల కారణాలపై అఫిడవిట్ వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుదనేది కూడా ఎన్నికల నిర్వహణపై ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Next Story