- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే : సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ విప్‌లే ప్రభుత్వానికి కళ్లు, చెవులని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటూ కీలక సూచనలు చేశారు

- ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చేందుకు ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోండి
- ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో ఒక రోజు విప్ లకు అందుబాటులో ఉంటా
- ప్రభుత్వ విప్ లతో సమావేశమైన సీఎం.. పలు కీలకాంశాలపైన చర్చ
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ విప్ లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఎంసీఆర్ హెచ్ఆర్టీలో శాసనసభ, శాసనమండలి విప్ లతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపైన సీఎం, విప్‌లతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను విప్ లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను విప్ లు సీఎంకి దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ లతో సమన్వయం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో ఒక రోజు విప్ లకు అందుబాటులో ఉంటానని సీఎం తెలిపారు. విప్ లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలని సీఎం వారికి సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని, విపక్ష పార్టీల విమర్శలకు సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని వారికి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయరమణరావు, రామచంద్రు నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ లు పాల్గొన్నారు.






