- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో నాలుగు అద్భుతాలు.. నాలుగోది ఇదే: CM రేవంత్
తెలంగాణలో నాలుగు అద్భుతాలు.. నాలుగోది ఇదే: CM రేవంత్

దిశ, తెలంగాణ బ్యూరో: రామోజీ రావు అందించిన విలువలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్న రామోజీ గ్రూప్‌ను అభినందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రూపుదిద్దిన రామోజీ ఫిల్మ్ సిటీ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప ఆస్తిగా సీఎం అభివర్ణించారు. సంస్థలను నిర్వహించడం అంత ఆషామాషీ కాదని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు వండర్స్ ఉన్నాయని అనుకుంటే.. అందులో ఒకటి చార్మినార్, రెండోది గోల్కొండ, మూడోది హైటెక్ సిటీ.. నాలుగో వండర్‌గా రామోజీ ఫిలిం సిటీ నిలిచిందన్నారు. ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్క్రిప్ట్ తో వచ్చి ప్రింట్ తీసుకుని వెళ్లండని రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించినప్పుడు రామోజీ రావు అనేవారని.. ఇప్పుడు ఫిల్మ్ సిటీని ఆస్థాయిలో తీర్చిదిద్దారని ప్రశంసించారు. నిద్రలేవగానే ఈనాడు చదవడం.. నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలు చూడడం అందరికీ అలవాటుగా మారిపోయిందన్నారు. వాస్తవాలను అందించాలన్న తపన వారిలో కనిపిస్తుందని మెచ్చుకున్నారు.
పచ్చళ్లు తినిపించినా, పత్రిక చదివించినా.. అది రామోజీ రావుకే సాధ్యమైందన్నారు. ప్రతీ రంగంలో రామోజీ రావు తనదైన ముద్ర వేశారని సీఎం కొనియాడారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు పొందిన వారికి అభినందనలు తెలిపారు. మనందరం రామోజీ రావు ఆలోచనలని భవిష్యత్ తరాలకి అందించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. రామోజీ ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్ అని ఆ బ్రాండ్ ను అలాగే కొనసాగించాలని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు.






