రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. CM రేవంత్ భరోసా

by Gantepaka Srikanth |

వానాకాలం పంటల సాగుకు వ్యవసాయశాఖ సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. CM రేవంత్ భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: వానాకాలం పంటల సాగుకు వ్యవసాయశాఖ సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు, ఎరువులు రైతాంగానికి అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణరావుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని, రాష్ట్ర సరిహద్దులు అన్ని చోట్ల టాస్క్ ఫోర్స్ నిఘా ఉంచాలని చెప్పారు. కల్తీ విత్తనాలు విక్రయించే, నిల్వలు, రవాణా చేస్తున్న వారెవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలన్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్తీ విత్తనాల బారిన పడకుండా రైతుల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు చెప్పారు.

అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సీజన్లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని చెప్పారు. ఎరువులు, విత్తనాల గురించి రైతులు(Telangana Farmers) ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో, రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన సూచనలను రైతులు గమనించాలన్నారు.

Next Story