అసెంబ్లీ విప్‌లపై సీఎం రేవంత్ ఫైర్.. ‘ఆరుగురు ఉన్నా నో యూజ్’ అని అసహనం!

by Kema Shiva Kumar |

తెలంగాణ అసెంబ్లీలో విప్‌ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అసెంబ్లీ విప్‌లపై సీఎం రేవంత్ ఫైర్.. ‘ఆరుగురు ఉన్నా నో యూజ్’ అని అసహనం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో విప్‌ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. మంత్రులు, సభ్యుల మధ్య సమన్వయం సాధించడంలో విఫలమవుతున్నట్లు అసహనం వ్యక్తం చేశారని సమాచారం. విపక్షాల విమర్శలు, ఆరోపణలపై వెంటనే కౌంటర్ చేయడంలోనూ చొరవ చూపడం లేదని కామెంట్ చేసినట్లు తెలిసింది. ‘బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సమయంలో విప్‌లు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయారు. గతంలో బీఆర్ఎస్ దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించింది. మరి పదేండ్ల పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారు’ అని విప్‌లు కౌంటర్ ఇవ్వలేకపోయారని సీఎం సీనియర్ లీడర్ల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సభ ప్రారంభానికి ముందు సభా వ్యవహారాల మంత్రి, విప్‌లు సమావేశమై ఆ రోజు జరిగే కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాలి. కానీ, శ్రీధర్ బాబు నిర్వహించే స్ట్రాటజీ మీటింగ్ కొందరు విప్‌లు మాత్రమే హాజరవుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో సభలో రూలింగ్ పార్టీ సభ్యుల పనితీరు పేలవంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.-

చొరవచూపని విప్‌లు..

ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీలో కేవలం ముగ్గురు విప్‌లు మాత్రమే ఉండగా ఈనెల 18న మరో ముగ్గురుని విప్‌లుగా నియమించారు. దీంతో ఆరుగురు విప్‌లతో సభలో రూలింగ్ పార్టీ పెర్ఫార్మెన్స్ గతంలో కంటే మెరుగ్గా ఉంటుందని అందరూ ఆశించారు. కానీ, వారం రోజులుగా సభలో విఫ్ ల పని తీరును గమనించిన తరువాత ‘ఆరుగురు విప్‌లు ఉన్నా ప్రయోజనం లేదు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. విపక్షాల విమర్శలకు వెంటనే కౌంటర్ చేయట్లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి కొందరు నాయకుల ముందు కామెంట్ చేసినట్లు తెలిసింది. సభ్యులు సమయానికి సభాకు వస్తున్నారా లేదా పట్టించుకోవడం లేదని, సభ జరుగుతున్న సమయంలో కొందరు సభ్యులు ఇన్నర్ లాబీ, మంత్రుల చాంబర్లలో ఎమ్మెల్యేలు పిచ్చాపాటిగా మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఈ మధ్య బీజేపీ ఎమ్మెల్యే మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై కామెంట్ చేసిన సమయంలో విప్‌ల నుంచి ఆశించిన స్పందన రాలేదని చర్చ జరుగుతున్నది. ‘పాత ముగ్గురు విప్‌లలో కేవలం ఆది శ్రీనివాస్ మాత్రమే విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని, మిగతా విప్‌లు ఎప్పుడూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన సందర్భాలు లేవు’ అని ఓ సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు.

సీఎం రేవంత్ ఉన్నప్పుడే సీరియస్..

అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే విప్‌లు, సభ్యులు కాస్త హడావుడీ చేస్తుంటారని టాక్ ఉంది. సీఎం సభకు రాకపోతే మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోరనే కామెంట్స్ ఉన్నాయి. సభలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సైతం విమర్శలున్నాయి. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, సీతక్క మినహా మిగతా మంత్రులు విపక్షాల విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు అంతగా ఇంట్రస్ట్ చూపడం లేదనే కామెంట్స్ ఉన్నాయి. ‘తమ క్వశ్చన్‌కు సమాధానం చెప్పామా.. తమ శాఖకు సంబంధించిన పద్దుకు సభ ఆమోదం పొందిందా’ అనే తీరుగా మంత్రులు వ్యవహరిస్తున్నారే తప్ప సభా కార్యక్రమాలను సొంతం చేసుకోవడం లేదని విమర్శలు కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నాయి.

Next Story