- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజగోపాల్ రెడ్డి తీరుపై CM రేవంత్ గరం.. వరుస స్టేట్‌మెంట్లతో అసహనం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్ని రోజులుగా మాట్లాడుతోన్న తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్ని రోజులుగా మాట్లాడుతోన్న తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పదే పదే సీఎంకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే ఆయనకు మంత్రి పదవి దక్కడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి వరుసగా చేస్తోన్న ప్రకటనలపై సీఎం సన్నిహితుల మధ్య హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ‘రేవంత్ బ్లాక్ మెయిల్ చేసినా, బెదిరించినా సహించరు. ఈ విషయం రాజగోపాల్‌రెడ్డికి తెలియదు’ అని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నెల 18న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. ఆ తరువాత అక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ రేవంత్ మాట్లాడుతూ.. ‘పాలమూరు బిడ్డనైన నేను పదేళ్ల పాటు సీఎంగా ఉండటం ఖాయం’ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి, తాము చేస్తోన్న మంచి పనులు చెబుతుంటే కుమిలి కుమిలి ఏడవాలి అని అన్నారు.
కొనసాగింపుగా అవే మాటలు..
పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని స్వయంగా రేవంత్ ప్రకటించడంపై రాజగోపాల్‌రెడ్డి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్‌రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు.’ అని పేర్కొన్నారు.
మంచి రోజులు రాబోతున్నాయి..
తెలంగాణ పాలిటిక్స్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతోంది. మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఆయన ఇటీవల తరుచుగా చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. ‘మనకు మంచిరోజులు రాబోతున్నాయి’ అంటూ ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు మాట్లాడినా నిర్మొహమాటంగా చెప్పేస్తాననని, తాను ఏదైనా ఓపెన్‌గానే మాట్లాడతానని స్పష్టం చేశారు. మొన్న రేవంత్‌రెడ్డి మాటలు తప్పని చెప్పానని, తప్పు చేస్తే అది తానైనా, మరెవరైనా ఒక్కటేనని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ.. రైతు భరోసా కొందరికే వచ్చిందని అంగీకరించారు. సర్కారు ఆర్థిక పరిస్థితి వల్ల ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సొంతపార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నా.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం అందరికీ రైతుభరోసా అందలేదంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






