- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీలో సవాల్ విసిరిన రేవంత్.. ఎలక్షన్ టైంలో ఇరకాటంలో గులాబీ పార్టీ
స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కక్కలేక మింగలేని స్థితిలోకి చేరుకుంది. సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను ఎలా స్వీకరించాలో తెలియక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కక్కలేక మింగలేని స్థితిలోకి చేరుకుంది. సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను ఎలా స్వీకరించాలో తెలియక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై బీఆర్ఎస్ పార్టీ కిక్కురుమనకుండా ఉండిపోయింది. మొన్నటివరకు కాంగ్రెస్‌కి దమ్ముంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు డిఫెన్స్‌లో పడిపోయారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గగ్గోలు పెట్టిన వారంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చట్టబద్ధతతో పనిలేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తామని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు సైతం 42 శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తారా? అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. అది కాస్త బీఆర్ఎస్ నేతలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇప్పుడు బీఆర్ఎస్ నిర్ణయంపై రాష్ట్రంలోని బీసీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం సవాల్‌ను బీఆర్ఎస్ స్వీకరిస్తుందా? బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందా? అన్న చర్చ నడుస్తున్నది. ఈ అంశంతో బీఆర్ఎస్‌కు బీసీలపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థం అవుతుందన్న టాక్ నడుస్తోంది.
ఎరక్క పోయి ఇరుక్కుని?
కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే.. దానిపై సలహాలు సూచనలు ఇవ్వకుండా ఎంతసేపూ బీఆర్ఎస్ నేతలు 42 శాతంపైనే డిమాండ్ చేశారు. తీరా చూస్తే ప్రభుత్వం నుంచి అలాంటి రిప్లై వస్తుందని వారు ఊహించలేకపోయారు. ఇప్పుడేమో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. అనవసరంగా 42శాతం రిజర్వేషన్‌పై డిమాండ్ చేశామా? అన్న ప్రశ్న గులాబీ నేతల మధ్య నడుస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీని తిరస్కరించారు. మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ టైంలో సీఎం సవాల్‌ను స్వీకరించేందుకు పార్టీ సిద్ధంగా ఉందా? లేదా..? అన్న చర్చ జోరుగా సాగుతున్నది.
కేటీఆర్ వద్దకు ఉరుకులు పరుగులు
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికపై బుధవారం పలువురు బీసీ నేతలు తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్‌మీట్ పెట్టారు. నివేదికను ముక్తకంఠంతో ఖండించారు. బీసీలకు న్యాయం జరిగే దాకా బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని ప్రకటనలు చేశారు. కానీ, మీడియా సమావేశం ముగిసాక వారంతా ప్రైవేటుగా సమావేశం అయ్యారు. కాంగ్రెస్ ఒకవేళ 42 శాతం సీట్లు కేటాయిస్తే.. తమ పరిస్థితి ఏంటన్న విషయమై చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దనే తేల్చుకుందామని ఓ నిర్ణయానికి వచ్చి.. ఆయన వద్దకు ఉరుకులు, పరుగులు పెట్టారు. కాంగ్రెస్ ఒకవేళ రిజర్వేషన్ అమలు చేస్తే.. తమ పార్టీ అమలు చేయకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందన్న ఆందోళన వారిలో కనిపించింది. ఈ విషయమై ఎలా ముందుకు వెళ్లాలో తెలియక పార్టీ అధినేత సలహా కోసం వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా సభలకు ప్లాన్?
కాంగ్రెస్ అమలు చేస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు బూటకమని.. చట్టబద్ధత లేకుండా అమలు అసాధ్యమంటూ ప్రజలను నమ్మించేందుకు గులాబీ దండు రాష్ట్రవ్యా్ప్తంగా సభలు నిర్వహించేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. అందులో భాగంగా ముందుగా సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ వేదికగా సభ పెట్టాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చే ప్లాన్‌లో భాగంగానే ఈ సభలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై కేటీఆర్‌తో భేటీలోనూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతి త్వరలోనే సభలకు ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్..
పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆరే బీఆర్ఎస్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. రాజకీయ పార్టీగా మారినప్పటికీ కేసీఆరే ప్రెసిడెంటుగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆయన ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కాస్త అసంతృప్తి నెలకొన్నట్లు టాక్ .అందుకే, ఈసారి బీసీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీలకు పదవి కేటాయించి, వారిపై ఉన్న చిత్తశుద్ధిని చాటాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఇప్పటికీ ఇంకా కమిటీల ఏర్పాటుకు వెళ్లని పార్టీ.. త్వరలోనే నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. అప్పటిలోగా బీసీ అధ్యక్షుడి నియామకంపై ఏమైనా ఆలోచన చేస్తారా? లేదా? అనేది చూడాలి.






