ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులు.. సీఎం కేసీఆర్

by Javid Pasha |

ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులు.. సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారు చేసే దిశగా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరమున్నదన్నారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక రంగాల్లో భోధన, శిక్షణ అవసరమున్నదన్నారు. కోకాపేటలో ‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్) కు సోమవారం సీఎం శంకుస్థాపన చేశారు. ముందుగా వేద మంత్రోశ్చారణల నడుమ వేద పండితులు నిర్వహించిన భూ వరాహ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వర్తమాన భారతానికి అవసరమున్నదన్నారు.

సమాజాభివృద్ధికి దోహదం చేసే దిశగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుభవజ్జులైన మేధావులను, నోబుల్ లారేట్లను కూడా పిలిచి నాయకత్వ శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రజలకు సుపరిపాలన నందించే నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని, తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్టం చేసే కృషి చేస్తామన్నారు. అందులో భాగంగానే ‘పొలిటికల్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ ఆర్ డీ’ కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో శిక్షణనిచ్చేందుకు దేశం నలు మూలలనుంచి అనుభవజ్జులైన రాజనీతి శాస్త్రజ్జులు, ఆర్థిక వేత్తలు సామాజిక వేత్తలు సమాజాభివృద్ధికి దోహదం చేసే రచయితలు ప్రొఫెసర్లు విశ్రాంత అధికారులు తదితరులను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. దేశం నలుమూలలనుంచి వచ్చే సామాజిక కార్యకర్తలకు, రాజకీయ వేత్తలకు, నాయకులకు భారత్ భవన్ లో సమగ్రమైన సమస్త సమాచారం లభ్యమవుతుందని అన్నారు.

శిక్షణకు అనుగుణంగా తరగతి గదులు, ప్రొజెక్టర్ తో కూడిన మినిహాల్స్, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్ లైబ్రరీలు, వసతికోసం లగ్జరీ గదులు నిర్మితమవుతాయని అన్నారు. దేశ విదేశాల వార్తా పత్రికలు అందుబాటులో వుంటాయని తెలిపారు. ప్రజలను నిత్యం ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాల పట్ల అవగాహన కోసం ప్రత్యేక శిక్షణాతరగతులుంటాయని, మీడియా రంగంలో రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికను అందిపుచ్చుకునే దిశగా సీనియర్ టెక్నికల్ బృందాలు కూడా పనిచేస్తాయని తెలిపారు. సంక్షేమం అభివృద్ధి రంగాల అధ్యయనం దిశగా, శిక్షణ సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.

అనంతరం ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ లే అవుట్ నియోపోలీస్ లో మొక్క నాటారు. సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, శేరి సుభాష్ రెడ్డి,శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరలు పాల్గొన్నారు.

Next Story