- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సీఎం ఫోకస్
రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులపై సీఎం ఫోకస్ పెట్టారు. నిలిచిన హైవేల పనులు, త్వరలో చేపట్టనున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి నేడు ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులపై సీఎం ఫోకస్ పెట్టారు. నిలిచిన హైవేల పనులు, త్వరలో చేపట్టనున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి నేడు ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. పనులు వేగంగా సాగేందుకు, అడ్డంకులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించి.. పరిష్కార మార్గాలను చూపించనున్నారు. సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, ఎన్ హెచ్ఏఐ, అటవీ, రెవెన్యూ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఢిల్లీ నుంచి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు.
పనుల్లో జాప్యంతో..
రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొందరు బాధితులు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం అందించాల్సిన పరిహారంలో సమస్యలు నెలకొన్నాయి. అటవీ భూముల్లో నుంచి రహదారులు నిర్మించేందుకు అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. కొన్ని పనులకు పర్యావరణ అనుమతులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల రోడ్డు విస్తరణలో భాగంగా సమీపంలో ఉన్న హైటెన్స్ విద్యుత్ వైర్లు, స్తంభాలు, విద్యుత్ టవర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్ లను తొలగించాల్సి ఉంది. వీటిని తొలగించేందుకు యుటిలిటీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చార్జీలు చెల్లించకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీటిని పరిష్కరించేందుకు తీసుకునే చర్యలపై సుదీర్ఘంగా చర్చించి.. రహదారుల పనులు సవ్యంగా చేపట్టే మార్గాలను సూచించనున్నారు.
15 హైవేలకు ప్రణాళికలు..
తాజాగా రాష్ట్రంలో మరో 15 జాతీయ రహదారులను రూ.33 వేల కోట్ల అంచనాలతో 1,123 కిలోమీటర్ల హైవేను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా సింగిల్ వే ఉన్న రోడ్లను డబుల్ రోడ్లుగా, డబుల్ వే ఉన్న రోడ్లను ఫోర్ వేస్ గా విస్తరించనున్నారు. అంతే కాకుండా మేజర్, మైనర్ బ్రిడ్జీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్వోబీ (రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీ) లను సైతం నిర్మించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా రహదారుల నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్ (డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టు) లు రూపొందించేందుకు అర్హులైన సంస్థల నుంచి టెండర్లు పిలిచింది. అందులో ఏడు హైవేల డీపీఆర్ ల కొరకు టెండర్లు ఖరారు చేశారు. 8 హైవేలకు సంబంధించిన డీపీఆర్ లు తయారు చేసేందుకు త్వరలో టెండరు ప్రక్రియ ద్వారా అర్హులైన సంస్థ అప్పగించనున్నారు. డీపీఆర్ లు రూపొందించిన అనంతరం రహదారుల నిర్మాణ బాధ్యతలను కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టనున్నది. ఈ అంశాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించనున్నారు.
వివిధ కారణాలతో నిలిచిన హైవేల పనులు
- విజయవాడ- నాగ్‌పూర్ సెక్షన్ (ఎన్ హెచ్-163జీ) కి సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ రహదారికి నిర్మాణానికి కొన్ని చోట్లలో భూసేకరణకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. దీంతో పనులు నిలిచిపోయాయి.
- హైదరాబాద్ – డిండి (ఎన్ హెచ్-765) కి సంబంధించి 85 కిలోమీటర్లున్న రహదారి పనులను 2 వరుసల నుంచి 4 వరుసలకు అప్ గ్రేడ్ చేస్తున్న ఈ బ్రౌన్ ఫీల్డ్ రహదారికి కొన్ని చోట్ల అటవీ శాఖ అనుమతులు కావాలి. ఈ శాఖ అనుమతులు లేకపోవడంతో రహదారి నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు.
- ఖమ్మం – దేవరపల్లి (ఎన్ హెచ్ 365జీజీ) గ్రీన్ ఫీల్డ్ రహదారిని 4 వరుసలుగా విస్తరిస్తుండగా.. పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
- ఆరు వరుసలుగా నిర్మిస్తున్న కర్నూల్–రాయచూర్ (ఎన్ హెచ్-150సీ) గ్రీన్ ఫీల్డ్ రహదారి రెండు ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో ఒక ప్యాకేజీ 38 కిలోమీటర్లు, మరో ప్యాకేజీ 38 కిలోమీటర్లుగా ఉన్నాయి. ఇక్కడ లేబర్, మ్యాన్ పవర్, యంత్రాలు పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
- హైదరాబాద్ మన్నెగూడ జాతీయ రహదారి 45 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. హైదరాబాద్ – మన్నెగూడ (ఎన్ హెచ్-163) రహదారి పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా అప్ గ్రేడ్ చేయనున్నారు. కానీ పర్యావరణ అనుమతులకు సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఉండటంతో ఇంకా పనులు మొదలు కాలేదు.
- హైదరాబాద్ – నాగ్ పూర్ (ఎన్ హెచ్ 44) కు సంబంధించిన 17 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లున్న రెండు ప్యాకేజీల పనుల్లో రోడ్ వైడెనింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరిస్తున్న ఈ రహదారులు పూర్తయితే హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి.






