ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఫోకస్.. నియోజకవర్గాల వారీగా రివ్యూ షురూ

by Kema Shiva Kumar |

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు ప్రారంభించారు.

ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఫోకస్.. నియోజకవర్గాల వారీగా రివ్యూ షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు ప్రారంభించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఏమేం పనులు చేశారని, ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేశారని ఆయన ఆరా తీస్తున్నారు. అలాగే పార్టీ బలోపేతం కోసం ఏమేం కార్యక్రమాలు చేపట్టారని వివరాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా భేటీ అవుతానని జపాన్ పర్యటనకు వెళ్లేముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా గురువారం రోజున కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆయన మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు.

ఎమ్మెల్యేల ముందు ప్రొగ్రెస్ రిపోర్టు..

సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు ముందుగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. అందరినీ ఒకేసారి కూర్చోపెట్టి మాట్లాడకుండా, ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. నియోజకవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిస్థితులపై నేరుగా చర్చించారు. ఈ సందర్భంగా ఈ 17 నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన నిధులు వివరాలను సదరు ఎమ్మెల్యేల ముందు పెట్టినట్లు తెలిసింది. ‘ప్రభుత్వం తరపున ఇన్ని కార్యక్రమాలు చేశాం. మీరు ఏం చేశారో చెప్పండి? పథకాల ప్రచారం కోసం ఏమేం కార్యక్రమాలు చేశారు? ఎన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు? పార్టీ కార్యకర్తలతో ఎన్ని సార్లు మీటింగ్ జరిపారు?’ అనే వివరాలను పేపర్‌పై రాసివ్వాలని అడిగినట్టు తెలుస్తున్నది.

రాబోయే మూడేండ్లలో ఏం కావాలో చెప్పండి!

రానున్న మూడేండ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో లిఖితపూర్వకంగా రాసివ్వాలని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ నేరుగా కోరినట్టు సమాచారం. అలాగే పెండింగ్‌‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపైనా ఆరా తీసినట్లు తెలుస్తున్నది. ముఖాముఖి సమావేశం కావడంతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంపై దృష్టి పెట్టకుండా, తమకు తెలిసిన కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేయాలని సీఎం ముందు ప్రస్తావించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దీంతో సీఎం బిల్లుల విషయాన్ని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సిన పనులను వివరించాలని సూచించినట్లు తెలిసింది. జూన్ 2లోపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యేందుకు సీఎం ప్లాన్ చేసుకున్నారు. ఆ తరువాత ఎమ్మెల్యేల సూచనల మేరకు నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తి చేయడం, కొత్త పనులను ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది.

Next Story