మూసీ పునరుజ్జీవనంలో స్పీడ్ పెంచిన సీఎం: 100 రోజుల్లో రెండో దశ డీపీఆర్!

by Kema Shiva Kumar |

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

మూసీ పునరుజ్జీవనంలో స్పీడ్ పెంచిన సీఎం: 100 రోజుల్లో రెండో దశ డీపీఆర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గతేడాది చాదర్‌ఘాట్‌లో ఇండ్లు కూలగొట్టి అభాసుపాలైన ప్రభుత్వం అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే 55 కిలోమీటర్ల మూసీపునరుజ్జీవనం ప్రాజెక్టలో 37 కిలోమీటర్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. గండిపేట్, హిమాయత్ సాగర్ల నుంచి లంగర్ హౌస్ (గాంధీ సరోవర్ ప్రాజెక్టు) వరకు మొదటి దశలో 21 కిలోమీటర్ల మార్గంలో ప్రాజెక్టు పనులు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండో దశలో నాగోల్ నుంచి గౌరెళ్లి వరకు చేపట్టాలని సంకల్పించింది. 55 కిలోమీటర్ల ప్రాజెక్టులో 37 కిలోమీటర్ల రెండు దశలోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే మొదటి దశ 21 కిలోమీటర్లకు డీపీఆర్ సిద్ధం చేసిన ఎంఆర్డీసీఎల్ రెండో దశ 16 కిలోమీటర్లకు వంద రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని నిర్ణయించింది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఒక వైపు మొదటి దశ పనులను వేగవంతం చేస్తూనే రెండో దశ డీపీఆర్ దృష్టి సారించాలని అధికారులకే ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ రెండు మొదటి, రెండో దశ పనులకు భూసేకరణ తక్కువ ఉండడంతో ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొదటి దశ 21 కి.మీలకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ -1లో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేరకు పూర్తి చేయడానికి మంత్రిమండలి పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఫేజ్-1 ప్రాజెక్టు అభివృద్ధి కోసం రూ.7,345 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8కి.మీ, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ మార్గాల్లో ఇండ్ల నష్టం తగ్గించే విధంగా ప్రణాళికల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి భూసేకరణ, హిమాయత్ సాగర్ బండ్ బలోపేతం, ఎకో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు విస్తరణ, రక్షణశాఖకు సంబంధించిన భూములను సేకరించే కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది.

ఏడీబీ లోన్ కోసం ఎస్క్రో అకౌంట్

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ఐదు జోన్లుగా విభజించిన విషయం తెలిసిందే. గండిపేట్ నుంచి గాంధీ సరోవర్ (బాపుఘాట్) 21 కిలోమీటర్ల ప్రాజెక్టు డీపీఆర్ పూర్తికావడంతోపాటు ప్రభుత్వం సైతం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఏసియన్ డవలప్ మెంట్ బ్యాంకు(ఏడీబీ) లోన్ ప్రక్రియ పూర్తయినట్టే. అయితే ఏడీబీ లోన్ కోసం ప్రత్యేకంగా ‘ఎస్క్రో అకౌంట్’ క్రియేట్ చేయడానికి ఎంఆర్డీసీఎల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు అధికారులతో సైతం చర్చించినట్టు తెలిసింది. దీంతోపాటు మొదటి దశ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియకు సంబంధించిన పేపర్ వర్క్ ను ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. మొదటి దశ టెండర్ పనులు, రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్ పనులను ఏకకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ దిశగా ఎంఆర్డీసీఎల్ అధికారులు చర్యలు ప్రారంభించారు.

Next Story