ఐకేపీ గోదాం దుస్థితి: మూడు నెలలకే మూతపడిన పచ్చళ్ల కేంద్రం.. మహిళల సొమ్ము గల్లంతు!

by Ramesh Naini |

మహిళా సమాఖ్య సభ్యులకు పచ్చల తయారీపై శిక్షణ ఇవ్వడం పేరుతో కొంత కాలయాపన జరిగినప్పటికీ, కరోనా కష్టకాలం రావడంతో అటు పచ్చల తయారీ నిలిచిపోవడం, ఇటు మహిళలకు పూర్తిస్థాయి తయారీ విధానం తెలియకపోవడం, తయారుచేసిన పచ్చళ్లు మార్కెటింగ్ చేయకపోవడం మూలంగా పచ్చళ్ల తయారీ కేంద్రం చివరకు మూతపడింది.

ఐకేపీ గోదాం దుస్థితి: మూడు నెలలకే మూతపడిన పచ్చళ్ల కేంద్రం.. మహిళల సొమ్ము గల్లంతు!
X

దిశ, గన్నేరువరం : నాడు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ధాన్యం నిలువ చేసుకోవడానికి మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ రూ .40 లక్షల నిధులతో 2017 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఐకేపీ గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయిన అనంతరం 2019 వ సంవత్సరంలో ఈ గోదామును ప్రారంభించారు. అప్పటి నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో గోదాం నిర్వహణ జరుగుతున్న క్రమంలో 2020 సంవత్సరంలో నాబార్డ్ సహకారం తో ఓ ఎన్జీవో సంస్థ మహిళా సమాఖ్య సంఘాల సభ్యుల సహకారంతో వారి వద్ద నుంచి రూ. 15 లక్షల సొమ్మును తీసుకొని ఈ ఐకేపీ గోదాము లో పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పచ్చల తయారీ కేంద్రాన్ని అప్పటి మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి హట్టహాసంగా ప్రారంభించారు. ఈ విధంగా ప్రారంభమైన పచ్చల తయారీ కేంద్రం కేవలం మూడు నెలలు ముచ్చటగా కొనసాగింది. ఎన్జీవో సంస్థ మహిళా సమాఖ్య సభ్యులకు పచ్చల తయారీపై శిక్షణ ఇవ్వడం పేరుతో కొంత కాలయాపన జరిగినప్పటికీ, కరోనా కష్టకాలం రావడంతో అటు పచ్చల తయారీ నిలిచిపోవడం, ఇటు మహిళలకు పూర్తిస్థాయి తయారీ విధానం తెలియకపోవడం, తయారుచేసిన పచ్చళ్లు మార్కెటింగ్ చేయకపోవడం మూలంగా పచ్చళ్ల తయారీ కేంద్రం చివరకు మూతపడింది.

15 లక్షల స్వాహా చేసిన ఎన్జీవో సంస్థ..?

మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పిన ఎన్జీవో సంస్థ మహిళా సమాఖ్య సభ్యుల నుంచి రూ. 15 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టించి తయారీ యంత్రాలను కొనిపించి పచ్చళ్ల తయారీ, మార్కెటింగ్ మాదే బాధ్యత అని నమ్మించి సొమ్మును కాజేసి ముఖం చాటేసిందని మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అటు బ్యాంకులో రూ.15 లక్షల బకాయి మహిళా సంఘాలపై మీదపడగా శ్రీనిధి అర్హత కోల్పోయి ఇంటికి చెడ్డ రేవడిగా మహిళా సమాఖ్య సంఘాలు తయారయ్యాయి. అటు బ్యాంకర్ల నుంచి బకాయి చెల్లించాలనే వేధింపులు, విద్యుత్ సంస్థ నుంచి కరెంటు బిల్లు చెల్లించాలని వేదనలు మిగిలాయి. ఈ వేధింపులకు తాళలేక ఎన్జీవో సంస్థ నిర్వాహకులపై మహిళా సమాఖ్య సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అధికారులు చర్యలు తీసుకోవాలి

నాడు పచ్చళ్ల తయారీ కేంద్రంగా వర్ధిల్లిన ఐకేపీ గోదాం నేడు మూతపడి కేవలం చినిగిన గన్నీ బ్యాగులు నిలువ చేసుకునే దీనావస్థలో మిగిలిపోవడం శోచనీయమని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాటు ఏ విధమైన ఆలనా పాలనా లేక గోదాం, దానిలోని సామాగ్రి ధ్వంసం అవుతున్నాయి. ఈ గోదామును ధాన్యం నిలువ కోసమైనా వినియోగించి రూ.40 లక్షల ప్రజాధనాన్ని నిరూపయోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రూ.15 లక్షల రుణాన్ని ఎన్జీవో సంస్థ నుంచి కట్టించి శ్రీనిధి అర్హత ఇప్పించి బ్యాంకు వేధింపుల నుంచి రక్షించాలని మహిళా సమాఖ్య సభ్యులు ప్రజా ప్రతినిధులను అధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందిస్తారో ఐకేపీ గోదాం నిర్వహణ చేస్తారో వేచి చూడాలి.

Next Story